India’s Cheapest AC Train: భారతీయ రైల్వేలో సాధారణ రైళ్ల నుంచి ప్రీమియం రైళ్ల వరకు ఉన్నాయి. ఆయా రైళ్లలో కల్పించే సౌకర్యాలను బట్టి టికెట్ల ధర పెరుగుతూ ఉంటుంది. లగ్జరీ ప్రయాణం చేయాలనుకుంటే ప్రీమియం కేటగిరీ టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్, రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లు విలాసవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. కానీ, తక్కువ ధరలో లగ్జరీ ప్రయాణాన్ని అందించే రైళ్లు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసా?
గరీబ్ రథ్.. పేదల ‘రాజధాని ఎక్స్ ప్రెస్’
దేశంలో చౌకైన ఏసీ ఎక్స్ ప్రెస్ గా గరీబ్ రథ్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు పూర్తిగా ఏసీ కోచ్ లను కలిగి ఉంటుంది. బడ్జెట్ లో సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. నిజానికి భారతీయ రైల్వేలో టికెట్ ఛార్జీలు కోచ్, సౌకర్యాలను బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు.. AC కోచ్ లు అదనపు సౌకర్యాతో స్లీపర్, జనరల్ కోచ్ లతో పోలిస్తే అధిక ఛార్జీని కలిగి ఉంటాయి. కానీ. పేదల ‘రాజధాని ఎక్స్ ప్రెస్’ గా పిలిచే గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ లో AC కోచ్‌లు, ప్రీమియం సౌకర్యాలు ఉన్నప్పటికీ ఛార్జీ చాలా తక్కువగా ఉంటుంది. వేగంలోనూ ఈ రైలు వందే భారత్, రాజధాని ఎక్స్ ప్రెస్ లతో పోటీపడుతుంది. సగటున గంటకు 70 నుంచి 75 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
కిలో మీటరుకు 68 పైసల ఛార్జీ
పేద మధ్య తరగతి ప్రజలు లగ్జరీ ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో గరీబ్ రథ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. సరసమైన ధరకు AC ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నది. ఈ రైలులో కిలోమీటరుకు కేవలం 68 పైసల ఛార్జీతో.. చక్కగా ఏసీ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. రాజధాని, శతాబ్ది, వందే భారత్ రైళ్ల మాదిరిగానే, ఈ రైలు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ గా ఉంటుంది. గరీబ్ రథ్ మొదటి సర్వీస్ ను 2006లో అప్పటి రైల్వే మంత్రి లాలు ప్రసాద్ యాదవ్ సహర్సా-అమృత్ సర్ రూట్ లో ప్రారంభించారు.
Read Also: దేశంలో 1వ నెంబర్ ప్లాట్ ఫారమ్ లేని ఏకైక రైల్వే స్టేషన్.. ఏ రాష్ట్రంలో ఉందో తెలుసా?
సుదూర మార్గాల్లో ప్రయాణం
గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ ప్రధానంగా సుదూర మార్గాల్లో నడుస్తున్నది. భారతదేశం అంతటా ప్రధాన నగరాలు, కీలక రైల్వే స్టేషన్లను కలుపుతుంది. ప్రస్తుతం ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-చెన్నై, పాట్నా-కోల్‌కతా వంటి నగరాలను కలుపుతూ 26 వేర్వేరు మార్గాల్లో నడుస్తున్నాయి. ఈ రైళ్లు ఏడాది పొడవునా రద్దీగా ఉంటాయి. ఢిల్లీ-చెన్నై మధ్య నడిచే హజ్రత్ నిజాముద్దీన్ గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ 2,075 కి.మీ.ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఇది 28 గంటల 30 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. టికెట్ ధర కేవలం రూ.1500.
Read Also: ఆ రాష్ట్రంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్, అక్కడికి వెళ్లాలంటే తల ప్రాణం తోకకు రావాల్సిందే!