Tollywood: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. అటు సినీ ఇండస్ట్రీకి తీరని లోటు మిగల్చడమే కాకుండా సినీ పరిశ్రమను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రముఖ నాట్యకారిణి, ప్రముఖ నటి విజయభాను(Vijayabhanu ) కన్నుమూశారు. 68 సంవత్సరాల వయసులో ఆమె మరణించడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందాల తారగా, అద్భుతమైన నటిగా అంతకుమించిన నాట్యకారిణిగా పేరు సొంతం చేసుకున్న ఈమె అమెరికా నుంచి ఇటీవలే చెన్నైకి వచ్చారు. అక్కడ వడదెబ్బతో మరణించినట్లు విజయభాను సోదరి సింధూరి వెల్లడించారు. ఈ విషయం తెలిసి అభిమానులు మరింత దుఃఖింతలవుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా.. ఎందుకు ఆమె బయటకు వెళ్లారు అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు.
విజయభాను అనంతపురం జిల్లాకు చెందిన వారే..
విజయభాను ఎవరో కాదు అనంతపురం జిల్లాకు చెందినవారు. ఈమె పలు భాషలలో దాదాపు 100కు పైగా చిత్రాలలో నటించారు. రాజబాబు(Rajababu ) – విజయభాను కాంబినేషన్ అప్పట్లో చాలా ఫేమస్. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అంతేకాదు ‘ఇది కథ కాదు’ అనే సినిమాలో ఈమె నటనకు ఏకంగా నంది అవార్డు కూడా లభించింది. ఇక 1980లో ఒక అమెరికన్ ను ప్రేమ వివాహం చేసుకున్న ఈమె.. అక్కడే సెటిల్ అయిపోయింది. ఇక ఇప్పుడు చెన్నైలో వడదెబ్బ కారణంగా ఆమె కన్నుమూసినట్లు సమాచారం.
విజయభాను కెరియర్..
విజయ్ భాను తెలుగు సినీ రంగంలో 1970లో ఒక వెలుగు వెలిగి స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు. నాట్యకారిణిగా, పాన్ ఇండియా నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె తెలుగుతో పాటు తమిళ్ , కన్నడ, హిందీ భాషల్లో కూడా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన ఈమె ఇలా సడన్గా మృతి చెందడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే అనంతపురం కు చెందిన ఈమె చెన్నైలో పుట్టి, పెరిగి నటనలో పట్టు సాధించారు. మొన్నటివరకు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లోనే ఉన్న ఈమె అక్కడే శ్రీ శక్తి శారద నృత్యనికేతన్ అనే నాట్య కళాశాలను స్థాపించి, వేలాదిమంది విద్యార్థులకు భారతీయ నాట్య రూపాల్లో శిక్షణ అందించారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకళి లాంటి క్లాసికల్ డాన్స్ లో తిరుగులేని పేరు సంపాదించుకున్నారు.
విజయభాను నటించిన చిత్రాలు..
దాదాపు 100కు పైగా సినిమాలలో నటించిన ఈమె చిరంజీవి (Chiranjeevi ), కమలహాసన్ (Kamal Haasan), జయసుధ (Jayasudha) లతో కే.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇది కథ కాదు’ సినిమాతో వెనుతిరిగి చూసుకోలేదు ఇక ఈ సినిమాలో ఉత్తమ సహాయనాటిగా నంది అవార్డు లభిస్తే అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చేతుల మీదుగా ‘నాట్యమయూరి’ బిరుదు తో పాటు నంది అవార్డు కూడా అందుకున్నారు. తెలుగు , తమిళ్లో ఎక్కువగా సినిమాలు చేసిన ఈమె ఎన్టీఆర్, ఎమ్జీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్ సినిమాలలో నటించింది. నిప్పులాంటి మనిషి, కిలాడి బుల్లోడు, ఒక నారి వంద తుపాకులు, చందన, స్త్రీ, శభాష్ పాపన్న, ప్రియ బాంధవి, చిన్ని కృష్ణుడు వంటి చిత్రాలలో నటించారు.
గొప్ప సంఘసంస్కర్త కూడా..
ఈమె తన తల్లి కట్టించిన శివ నారాయణ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. సేవ చేయడం అంటే ఎంతో ఇష్టపడే ఈమె సహాయం కోసం ఇంటికి వచ్చిన వారిని ఉట్టి చేతులతో పంపించేవారు కాదు. తమ సహాయం కోరిన వందలాది మందికి అండగా నిలిచారు. విజయభానుకి ఒక కుమార్తె ఉండగా.. ఆమె అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.