Tollywood Heroes : ఒక సినిమాకి హీరో మార్కెట్ ను బట్టి బడ్జెట్ పెడతారు. హీరో కాల్షీట్స్ ను బట్టి.. షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటారు. సినిమా కంప్లీట్ అయితే ప్రమోషన్ బాధ్యత అతను తీసుకోవాల్సి ఉంటుంది. రిలీజ్ తర్వాత హిట్ అయితే.. ఎక్కువ శాతం హీరోకి మాత్రమే క్రెడిట్ వెళ్తుంది. కానీ అందరూ దూరి ఇది టీం వర్క్ అంటారు. సినిమాకి లాభాలు వస్తే హీరోకి అంటూ ప్రత్యేకంగా అదనంగా ఏమీ చెల్లించరు. అవన్నీ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలే పంచుకుంటారు.
మరి సినిమా ప్లాప్ అయినప్పుడు మాత్రం హీరో ఎందుకు తిరిగి డబ్బులు చెల్లించాలి. అందులోనూ తాను తీసుకున్న పారితోషికంతో మేజర్ భాగం ఎందుకు రిటర్న్ ఇవ్వాలి. ఈ ప్రశ్నలు అందరినీ వెంటాడేవే. హీరో అనే కాదు.. సినిమాని ఒకసారి అమ్మేశాక నిర్మాతలు కూడా నష్టపరిహారం ఎందుకు చెల్లించాలి.? అగ్రిమెంట్లో ఇవన్నీ ఉంటాయా? అందుకే బయ్యర్స్ ఛాంబర్ ని ఆశ్రయిస్తారా? చాలా మందికి వీటికి కూడా సమాధానాలు తెలీవు.
‘లైగర్’ సినిమా టైంలో పూరీ జగన్నాథ్, ఛార్మీ, విజయ్ దేవరకొండ ఈ గొడవలతోనే నలిగిపోయారు. ‘లైగర్’ హైప్ చూసి బయ్యర్ భారీ రేట్లకి సినిమా హక్కులను కొనుగోలు చేశారు. అయితే సినిమా ప్లాప్ అయ్యింది. బయ్యర్స్ భారీగా నష్టపోయారు. ఆ నష్టాలను భర్తీ చేయాలని పూరీ, ఛార్మీ..లను కోరారు. వాళ్ళు ఓటీటీ నుండి రావాల్సిన డబ్బుల కోసం ఎదురుచూస్తున్న టైంలో ఛాంబర్ కి వెళ్లి రచ్చ రచ్చ చేశారు. పూరీ, ఛార్మీ బదులు హీరో విజయ్ దేవరకొండ తమని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వాస్తవానికి విజయ్ కి ఈ సినిమా కోసం రూ.20 కోట్లు ఆఫర్ చేసారని అప్పట్లో టాక్ వినిపించింది. కానీ ఫైనల్ గా అతనికి చెల్లించింది రూ.11 కోట్లు మాత్రమే అని విజయ్ టీం క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో పరోక్షంగా విజయ్ రూ.9 కోట్లు వదులుకున్నట్టే. పైగా అతను ముంబై వెళ్లి ప్రమోట్ చేయడం వల్లే అక్కడ సినిమా బాగా ఆడింది. ప్రమోషన్ కోసం విజయ్ ఎటువంటి పారితోషికం డిమాండ్ చేయలేదు. కానీ అతన్ని కూడా ఈ వివాదంలోకి లాగారు బయ్యర్స్. అగ్రిమెంట్ ప్రకారం చూసుకుంటే.. వాళ్ళు ఛాంబర్ ద్వారా న్యాయం పొందలేనప్పుడు.. అక్కడ ధర్నాలు చేయడం కాదు. కోర్టుకెక్కాలి కదా. అలా చేయలేదు. కోర్టుకు వెళ్తే సింపుల్ గా ఆ కేసుని ఆరంభంలోనే కొట్టేస్తుంది. పైగా కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేసారని బయ్యర్స్ కి ఫైన్ కూడా వేసే ఛాన్స్ ఉంది. సో లీగల్ గా కోర్టుకెక్కినా బయ్యర్స్ కి వచ్చేది ఏమీ ఉండదు అని దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
కానీ ఇండస్ట్రీలో రిలేషన్స్ అనేవి చాలా ముఖ్యం. హీరోకి అయినా దర్శకుడికి అయినా..! అందుకోసమే సామరస్యంగా సెటిల్మెంట్లు చేసుకుంటారు. నిర్మాతలు ఎక్కువ రెట్లు కోట్ చేసినప్పుడు.. నష్టాలు వస్తే కొంత భాగం అంటే 20 , 30 శాతం వెనక్కి ఇవ్వాలనే రూల్ తో అగ్రిమెంట్ చేయించుకోవచ్చు. అందుకే పూరీ కూడా ఆ టైంలో కొంత భాగం వెనక్కి ఇస్తాను అని హామీ ఇచ్చారు. కానీ ఈలోపే బయ్యర్స్ నానా రచ్చ చేసేశారు. చూస్తుంటే ఇప్పుడు మరో యంగ్ హీరో సినిమా విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది.