Varalakshmi Sarath Kumar: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేసి వర్కౌట్ కాక టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇక్కడ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. జూనియర్ రమ్యకృష్ణ (Ramyakrishna)గా పేరు దక్కించుకుంది. ముఖ్యంగా రమ్యకృష్ణ హీరోయిన్ గా అందాలు ఒలకబోయడమే కాకుండా.. విలనిజం చూపిస్తూ హీరోలకు చమటలు పట్టించేది. ఇప్పుడు అదే రేంజ్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా నటిస్తూ దూసుకుపోతోంది. ఒకవైపు హీరోయిన్ గా, మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూనే ఇంకొక వైపు విలన్ గా కూడా నటిస్తూ భారీ పాపులారిటీ అందుకుంది.
మదగజరాజా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న వరలక్ష్మి..
ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలకు లక్కీగా మారిపోయింది వరలక్ష్మి శరత్ కుమార్.. గత రెండు సంవత్సరాలుగా ఈమె నటించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉండగా తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ తాను రాజకీయాల్లోకి వస్తానని చెబుతోంది.. తెలుగులో గత ఏడాది హనుమాన్ (Hanuman)సినిమాతో మెప్పించి పాన్ ఇండియా స్టార్ గా మారిన ఈమె దక్షిణాదిలో విలక్షణ నటిగా పేరు సొంతం చేసుకుంది. గత ఏడాది తన ప్రియుడు “నికోలయ్ సచ్ దేవ్” ను వివాహం చేసుకున్న తర్వాత కూడా నటనను కొనసాగిస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇదిలా ఉండగా తాజాగా విశాల్(Vishal ), వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarath Kumar), ప్రముఖ హీరోయిన్ అంజలి (Anjali) హీరో హీరోయిన్లుగా నటించిన ‘మదగజరాజా’ సినిమా 12 ఏళ్ల తర్వాత సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఇటీవల మూవీ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ఎంట్రీ గురించి తెలిపింది.
రాజకీయ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్..
వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. 12 ఏళ్ల తర్వాత మదగజరాజా సినిమా పొంగల్ సందర్భంగా తిరుపతికి రావడంతో అభిమానులలో కూడా అంచనాలు పెరిగిపోయాయి. ‘పోడా పోడి’ సినిమా తర్వాత నేను నటించిన రెండవ చిత్రం ఇదే. కమర్షియల్ అంశాలతో కూడిన వినోద భరితమైన కథా సినిమా ఇది. పదేళ్లలో సినిమా చాలా మారిపోయింది.ఇక రాజకీయ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. కచ్చితంగా రాజకీయాలలోకి వస్తాను. అయితే అందుకు ఇంకా సమయం ఉంది. నా స్ఫూర్తి దివంగత ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha). ఆమె స్పూర్తితోనే నేను కచ్చితంగా రాజకీయాలలోకి వస్తాను అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ తెలిపింది.
ట్రోలర్స్ పై మండిపడ్డ వరలక్ష్మి శరత్ కుమార్..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నెగిటివ్ కామెంట్స్ పై కూడా ఆమె మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాలలో అనవసరంగా వదంతులు ప్రచారం చేస్తున్నారు. అయితే నేను ఒకసారి విమానాశ్రయంలో విమానం బయలుదేరే సమయం కావడంతో అత్యవసరంగా వెళ్తుండగా.. కొంతమంది వచ్చి నాతో ఫోటోలను తీసుకున్నారు. అయితే అదే సమయంలో ఒకతను వచ్చి ఫోటో తీసుకుంటానని అడగ్గా, నాకు అప్పుడే సమయం మించి పోవడంతో నేను వద్దని చెప్పాను. దీంతో అతను వెంటనే ఫోటో తీసుకోనివ్వరా? మరి ఎందుకు మీరు నటనలోకి వచ్చారు? అని కామెంట్ చేశాడు. అలాంటి వారికి బుద్ధి లేదు నేను బదులివ్వాల్సిన అవసరం అంతకంటే లేదు అంటూ వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పుకు వచ్చింది ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.