ప్రముఖ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో కమెడియన్ సూరి హీరోగా, విజయ్ సేతుపతి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవాని శ్రీ తోపాటు తదితరులు కీలకపాత్రలు పోషించిన చిత్రం ‘విడుదల పార్ట్ 2’. గతంలో వచ్చిన ‘విడుదల’ సినిమాకి సీక్వెల్ గా డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా విడుదలైంది. తమిళ సినిమాగా వచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ‘విడుదల పార్ట్ వన్’ తెలుగు, తమిళ్ భాషలలో పాజిటివ్ టాక్ సంపాదించుకొని, తమిళంలో కలెక్షన్లు బాగా రాబట్టింది. ఇకపోతే తెలుగులో కలెక్షన్స్ రాలేదు అది మరో విషయం. అయితే నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ విడుదల పార్ట్ 2 గట్టిగా కలెక్షన్స్ వసూలు చేసింది. కానీ కథపరంగా ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేదు.
పార్ట్ వన్ రేంజ్ లో మెప్పించిందా..?
ముఖ్యంగా మొదటి భాగంలో ట్రైన్ యాక్సిడెంట్ సన్నివేశం ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. అందులో చాలామంది అమ్మాయిలు ఒంటిమీద నూలు పోగు లేకుండా నటించడం ఒక ఎత్తైతే, ఆ సన్నివేశాలు మనకు అసభ్యకరంగా కాకుండా ఎమోషనల్ గా కట్టిపడేయడం మరొక ఎత్తు. అలాంటి సన్నివేశాలు ఇప్పుడు ఈ పార్ట్ 2 లో లేవని కచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మొదటి భాగంలో మిగిల్చిన ప్రశ్నలను సెకండ్ పార్ట్ లో సరిగ్గా కంక్లూడ్ చేయకపోవడమే ప్రజలలో కన్ఫ్యూజన్ ఏర్పడడానికి కారణం అయింది. ఇక మొదటి భాగంలో కమెడియన్ సూరినే మెయిన్ రోల్ పోషించారు. రెండవ భాగంలో విజయ్ సేతుపతి చాలా బాగా నటించినా సూరి రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నటీనటులు కూడా తమ పెర్ఫార్మన్స్ తో ఓకే అనిపించారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడం, కథను ఎక్కువగా సాగదీయడం, క్లైమాక్స్ అసలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడమే ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడానికి కారణం అయ్యింది. టార్గెటెడ్ ఆడియన్స్ ని కూడా ఈ సినిమా బోర్ కొట్టించింది అని చెప్పవచ్చు.
విడుదల పార్ట్ 2 కలెక్షన్స్..
ఇదిలా ఉండగా ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటి భాగం విడుదలైనప్పుడు మొదటి రోజు.. రూ.3.85 కోట్లు రాగా.. సినిమా ఫుల్ రన్ ముగిసే సరికి రూ.43 కోట్లు వచ్చాయి. ఇక ఈ విడుదల పార్ట్-2 సినిమాకి మొదటి రోజే రూ.7కోట్ల కలెక్షన్స్ వసూలు కావడం గమనార్హం. ముఖ్యంగా ఒక్క తమిళ్లోనే రూ.6.6 కోట్లు రాగా తెలుగులో కేవలం రూ.0.4 కోట్లు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా మొదటి భాగం కంటే రెండవ భాగమే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది అని స్పష్టం అవుతుంది.
విడుదల పార్ట్ 2 థియేట్రికల్ బిజినెస్..
ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ లెక్కలు బట్టి చూస్తే తెలుగు రాష్ట్రలలో రూ.3.0 కోట్ల థియేటర్ బిజినెస్ జరిగింది. నైజాం రూ.1 కోటి, సీడెడ్ రూ.40 లక్షలు, ఆంధ్ర రూ.60 లక్షలు.. ఇక ఈ సినిమా తెలుగులో బ్రేక్ ఈవెన్ రాబట్టాలంటే రూ.3.5 కోట్ల షేర్ ను దక్కించుకోవాల్సి ఉంటుంది.