Saif Ali Khan : గత వారం రోజుల నుంచి బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) పై జరిగిన దాడి, దానికి సంబంధించిన నిందితుల గురించి చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సైఫ్ అలీ ఖాన్ కు గతంలో ఎదురైన ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. “ముస్లిం అయిన కారణంగా మీకు ఇల్లు ఇవ్వము” అని సైఫ్ కు మొహం మీదే చెప్పేసారట.
సైఫ్ కు ఘోర అవమానం
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ముంబైలో జరిగిన అవమానం గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ ముంబైలోని పాష్ ఏరియా అయిన జుహూలో ఓ ఇంటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించగా, తనకు ఇలాంటి పరిస్థితి ఎదురైందని ఆయన చెప్పారు. ముస్లిమ్స్ కి జుహులో ఇల్లు ఇవ్వమని ఆయన మొహం మీదే చెప్పేసారట.
సదరు ఇంటర్వ్యూలో “విదేశాల్లో ఎప్పుడైనా జాతి వివక్షను ఎదుర్కొన్నారా ?” అనే ప్రశ్న ఎదురు కాగా, సైఫ్ స్పందిస్తూ “యూఎస్ఏ లో కాదు గానీ… నేను ఇండియాలోనే ఎదుర్కొన్నాను. భారతదేశంలో జాతి వివక్ష చాలా అనే ఫీలింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓ వ్యక్తి తన భార్యతో గొడవ పడడం, సోదరులతో పోరాడడం, లేదా మరో దేశంతో పోరాటం వంటివి సహజంగా జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం ఓ మతం మరొక మతంతో పోరాడుతుంది. ఈ పోరాటం అంతా మంచిది కాదు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సైఫ్.
అయితే ఓ స్టార్ హీరో తనకు మతం కారణంగా ఎదురైన ఇబ్బందులను, అది కూడా ముస్లిం మతం వల్ల ఎదురయ్యే అవమానాలను వెల్లడించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా తానొక ముస్లిం కావడం వల్ల ఓ ఫ్లాట్ ను కొనాలనుకున్నప్పుడు ఇలాంటి అనుభవమే ఎదురయిందనే చెప్పుకొచ్చారు.
సైఫ్ కేసులో మహిళ అరెస్ట్
ఇక మరోవైపు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కేసులో పోలీసులు వేగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సైఫ్ దాడి కేసులో ముంబై పోలీసులు బెంగాల్ కు చెందిన ఓ మహిళను ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితుడు ఆమె ఆధార్ కార్డును ఉపయోగించి, సిమ్ కార్డ్ కొన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆమెను అరెస్ట్ చేసి, స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు.
జనవరి మొదట్లో ఓ వ్యక్తి సైఫ్ (Saif Ali Khan) ఇంట్లోకి చొరబడి, దొంగతనాన్ని ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ దొంగతనాన్ని అడ్డుకోబోయిన సైఫ్ ను నిందితుడు కత్తితో గాయపరిచాడు. అనంతరం సైఫ్ ను లీలావతి ఆసుపత్రిలో చేర్పించగా, 5 రోజుల ట్రీట్మెంట్ తరువాత ఆయన ఇంటికి క్షేమంగా చేరుకున్నారు. అలాగే ఇప్పుడు సైఫ్ కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ముస్లిం అయిన కారణంగా ఆయన ఎదుర్కొన్న అవమానం గురించిన వార్త మరోసారి వైరల్ అవుతోంది.