Yash:కలయా? నిజమా? అని పాట పాడుకుంటున్నారు రాకీభాయ్ ఫ్యాన్స్. మరికొందరైతే తమని తాము గట్టిగా గిల్లి చూసుకుంటున్నారు. చూస్తున్నదంతా నిజమా? జరిగిందంతా నిజమేనా? ఎంట్రీ దొరికితే చాలంటే, ఏకంగా బాస్‌తో ఫొటో తీసుకోవడానికి ఛాన్స్ రావడమేంటనే ఆశ్చర్యంలో మునిగితేలుతున్నారు. ఇంత ఉపోద్ఘాతమూ యష్ గురించి. ఆయన తన ఫ్యాన్స్ తో దిగిన ఫొటోల గురించి. కన్నడ రాక్ స్టార్ యష్‌కి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్‌ఫాలోయింగ్ ఎలాంటిదో తెలిసిందే. ఆయనతో కర్ణాటకలో ఓ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు నార్త్ పోర్టల్ వాళ్లు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యష్, ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. చాలా ఓపిగ్గా వారితో ఇంటరాక్ట్ అయ్యారు. ఆయన ఆరాని చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆయనతో ఫొటో దిగాలని అనుకున్నారు.దాదాపు 700 మందికి పైగా అభిమానులతో ఫొటోలంటే మామూలు విషయం కాదు. అందుకే అందరితోనూ కలిసి యష్ ఒక సెల్ఫీ తీసుకుంటారని అనౌన్స్ చేశారు ఆర్గనైజర్స్. కానీ యష్ వద్దన్నారు. ఒక్కొక్కరితోనూ తాను సెల్ఫీ తీసుకుంటానని అన్నారు.
ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 700 మందితో సెల్ఫీలంటే మామూలు విషయం కాదు… ఆ విషయాన్నే కన్వే చేయడానికి ట్రై చేశారు ఆర్గనైజర్స్. ఎంత సమయం అయినా ఫర్వాలేదు, వాళ్ల ఆదరణ లేకుంటే, జాతీయ స్థాయిలో నాకు ఈ గుర్తింపు లేదు. నాకోసం వచ్చిన అభిమానుల కోసం నేను సమయం కేటాయించకపోతే ఎలా అంటూ అంత మందితోనూ ఫొటోలు తీసుకున్నారు యష్.
ఇది కలేనా? నిజమా? ఓ వైపు ఒళ్లు గగుర్పొడిచే సంఘటన, మరోవైపు అభిమాన నటుడు మనల్ని పలకరిస్తున్నారనే పులకరింత, ఆ క్షణాలు జీవితాంతం గుర్తిండిపోతాయ్ రాకీభాయ్ అంటూ ఆ ఫొటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ మైమరిచి పోతున్నారు ఫ్యాన్స్.
ఒక్కసారిగా అంత మంది ఫొటోలు షేర్ చేయడంతో ట్రెండ్ అవుతున్నారు యష్. అందరు హీరోలూ తమ అభిమానుల్ని ఇలా గౌరవిస్తే ఎంతో బావుంటుందనే మాటలు స్ప్రెడ్ అవుతున్నాయి. కేజీయఫ్ రెండు భాగాలతో దునియాను ఏలుతున్న యష్, త్వరలోనే థర్డ్ పార్ట్ కోసం సిద్ధమవుతున్నారు.