100 above dead in Bangladesh clashes.. Indians asked to take caution..indefinite curfew: బంగ్లాదేశ్ ప్రభుత్వం గత నెలరోజులుగా రిజర్వేషన్ల అంశంపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది. సొంత రాష్ట్రంలో విద్యార్థి సంఘాల నిరసనలు కాస్తా హింసాత్మకంగా మారడంతో అన్ని దేశాలు తమ దేశస్థులను వెనక్కి రప్పించుకుంటున్నాయి. బంగ్లా దేశ్ టూరిజం కూడా తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది. ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్ కు వెళ్లే టూరిస్టుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. భారత్ నుంచి ఎక్కువగా వైద్య విద్య కోసం విద్యార్థులు బంగ్లాదేశ్ కు వెళుతుంటారు. ఇప్పుడు ఆ దేశం లో నెలకున్న పరిస్థితులతో తప్పనిసరిగా దేశాన్ని విడిచి వెళ్ల వలసి వస్తోంది. అయితే ఇప్పటికీ కొందరు బంగ్లాదేశ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనితో అప్రమత్తమైన భారత విదేశాంగశాఖ ఇప్పట్లో అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకునే అవకాశం లేదని..ఇప్పటికే అక్కడ ఉన్న భారత సంతతికి చెందిన వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
అందుబాటులో సహాయ కేంద్రాలు
అవసరమైతే తప్ప ఏ ఒక్కరూ బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేసింది. భారతీయ పౌరుల సేవార్థం అక్కడ కొన్ని ఫోన్ నెంబర్లు, సహాయక కేంద్రాలలో అందుబాటులో ఉంచింది. ఆ ఫోన్ నెంబర్లను ఇండియన్ ఎంబసీకి లింక్ చేయడం జరిగింది. ఎవరైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తే తక్షణమే భారత రాయబార సంస్థ ప్రతినిధులను సంప్రదించవచ్చని తెలిపింది. ఇప్పటిదాకా బంగ్లాదేశ్ హింసాత్మక ఘర్షణలలో వందకు పైగా మృతి చెందారని..కొందరు పోలీసు అధికారులు కూడా ఈ ఘర్షణల్లో చనిపోయారని బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పరిస్థితి అదుపులోనే ఉంటోందని ప్రకటనలు ఇస్తున్నప్పటికీ ఆందోళనకారులు ఎక్కడా తగ్గడం లేదు. తమ కార్యకలాపాలు మరింత ఉధృతం చేశారు. ఇటీవల కొన్ని ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధాజ్ణలు జారీ చేసింది. ఆ ఉగ్రవాద సంస్థలకు విద్యార్థి రాడికల్ సంఘాలతో సంబంధం ఉన్నట్లు సమాచారం రావడంతో వీరిపై నిషేధాజ్ణలు జారీ అయ్యాయి.
షేక్ హసీనా రాజీనామా చేయాలని..
ప్రభుత్వ ఉద్యోగాలలో బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు వర్తింపజేసేలా చట్టం అమలు చేస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వంపై స్థానిక విద్యార్థులు మండిపడుతున్నారు. తమకు ఉద్యోగ అవకాశాలను ప్రధాని షేక్ హసీనా నిర్వీర్యం చేస్తున్నారని..బంగ్లాదేశ్ లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పడంలో ఆమె విఫలమయ్యారని ఇకనైనా ఆమె రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. దేశ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉండగా కొన్ని ప్రాంతాలలో నిరవధిక కర్ఫ్యూ విధించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ బల్క్ మెసేజెస్, ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. అందుకే ఇలాంటి ఉద్రిక్తతల మధ్య భారతీయులెవరూ బంగ్లాదేశ్ వెళ్లవద్దని..మళ్లీ తమ ఆదేశాలు వచ్చేదాకా బంగ్లాదేశ్ ప్రయాణాలు మానుకోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.