Iran president helicopter crash: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి విషయమై ఊహాగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా స్పందించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం వెనుక ఎవరిపాత్ర లేదని తేల్చి చెప్పారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను కూడా వివరించారు. 45 ఏళ్ల నాటి హెలికాప్టర్ ను వాడారాని.. అది కూడా వాతావరణం సరిగా లేని సమయంలో ఉపయోగించడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పేర్కొన్నారు.
అయితే, అంతకుముందు ఇరాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి జావెద్ మాట్లాడుతూ హెలికాప్టర్ విడిభాగాల సరఫరా విషయంలో అమెరికా విధించిన ఆంక్షల వల్లే తమ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించాడని జావెద్ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, రైసీ మృతికి కారణమైన బెల్ 212 హెలికాప్టర్ లో సిగ్నల్ వ్యవస్థ ప్రధాన లోపంగా కనిపిస్తున్నదని టర్కీ రవాణాశాఖ మంత్రి అబ్దుల్ పేర్కొన్నారు. అంతేకాదు.. ఆ హెలికాప్టర్ లో సిగ్నల్ వ్యవస్థ పనిచేయడంలేదని, అసలు సిగ్నల్ వ్యవస్థ ఉందో లేదో కూడా తెలియదని ఆయన అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తాము హెలికాప్టర్ సిగ్నల్ కోసం ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రముఖులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లలో సిగ్నల్ వ్యవస్థ మస్ట్ గా ఉండి తీరాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.
కాగా, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆ దేశ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దొల్లహియస్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. తూర్పు అజర్ బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్ కలాసీ, ఖొదాఫరీన్ అనే రెండు డ్యామ్ లను ప్రారంభించి తబ్రిజ్ నగరానికి వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురై మృతిచెందారు. తబ్రిజ్ నగరం ఇరాన్ లోని తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్స్ రాజధాని. అటుగా వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఇబ్రహీం రైసీ, విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దొల్లహియస్ హెలికాప్టర్ ప్రమాదానికి గురై మృతిచెందడంతో వారి స్థానంలో ఇతరులను నియమించారు. ఇరాన్ తాత్కాలికి అధ్యక్షుడిగా మహమ్మద్ ముఖ్బర్ ను నియమించారు. శాశ్వత అధ్యక్షుడిని ఎన్నికునే వరకు ఆయన అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. జూన్ లో అధ్యక్ష ఎన్నికలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి. ఈ అంత్యక్రియల్లో ఇండియా నుంచి పలువురు కేంద్రమంత్రులు హాజరవనున్నట్లు తెలుస్తోంది.
Also Read: కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన, కారణమిదే !
అయితే, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిన తరువాత పెద్ద ఎత్తున పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలు రేకత్తాయి. దీని వెనుక ఏమైనా ఇజ్రాయెల్ హస్తం ఉందా ఏందీ? అని, ఇలా రకరకాలుగా పెద్ద ఎత్తున అనేక కోణాల్లో ఊహాగానాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా స్పందించింది. ఇరాన్ అధ్యక్షుడి మృతి వెనుక ఎలాంటి కుట్ర లేదని తెలిపింది.