భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపేశానంటూ డొనాల్డ్ ట్రంప్ సెల్ఫ్ ఎలివేషన్లు ఇచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. తానే సంధానకర్తగా కాల్పుల విరమణకు బాటలు వేశానంటున్నారాయన. ఆ విషయం పక్కనపెడితే, ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి కూడా తానే ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్టు మరోసారి ట్రంప్ ప్రకటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతే అది నిజంగానే ట్రంప్ గొప్పదనం అనుకోవాలి. ఎందుకంటే 2022నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాని తీవ్రత తగ్గి పెరుగుతుందేమో కానీ కాల్పుల విరమణ మాత్రం జరగలేదు. అమెరికా అధ్యక్షపీఠం ఎక్కడానికి ముందే ట్రంప్.. ఆ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పారు. అయితే ఆయన రెండోసారి పదవి చేపట్టి నెలలు గడుస్తున్నా యుద్ధం ఆగలేదు. కానీ తాజాగా రష్యా అధ్యక్షుడు పుతున్ తో ట్రంప్ జరిపిన ఫోన్ సంభాషణ కాల్పుల విరమణపై ఆశలు చిగురింపజేస్తోంది.
2గంటలకు పైగా ఫోన్ కాల్..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరిపిన ఫోన్ సంభాషణ దాదాపు 2గంటలకు పైగా కొనసాగినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకి ఇది ముందడుగు అని తెలిపారు. తన ఫోన్ కాల్ పూర్తయ్యాక ట్రంప్.. మరో వీడియో కాన్ఫరెన్స్ లో కూడా పాల్గొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్, ఇటలీ ప్రధాని, జర్మనీ చాన్స్ లర్, ఫిన్‌లాండ్ అధ్యక్షుడితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. తన ఫోన్ కాలమ సంభాషణను ఆయన వారికి వివరించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు తక్షణమే ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ చర్చలకు వాటికన్ సిటీ వేదిక అవుతుందన్నారు. తన ఫోన్ కాల్ లో పుతిన్ స్నేహభావంతో మెలిగారని అన్నారు ట్రంప్.
ఇక పుతిన్ కూడా ఈ ఫోన్ కాల్ తో యుద్ధం ఆగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ తో శాంతి చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. శాంతి ఒప్పందం సాధించే మార్గంలో తాము కొన్ని ప్రాథమిక సూత్రాలు, షరతులు, టైమ్‌టేబుల్ వంటి అంశాలపై ఉక్రెయిన్ తో కలిసి పని చేయటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే ఫోన్ కాల్ పూర్తయిన తర్వాత రష్యా, అమెరికా దేశాధినేతల ప్రకటనలే కానీ.. చర్చలు ఇంకా మొదలు కాకపోవడం గమనార్హం. మొత్తానికి అమెరికా అధ్యక్షుడి ప్రయత్నం ఇక్కడ సఫలమైందనే చెప్పాలి. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ ప్రకటించడమే దీనికి నిదర్శనం. ఈ యుద్ధం కూడా ఆగిపోతే ఆ క్రెడిట్ ని ట్రంప్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం. ఇప్పటికే ఆయన భారత్-పాక్ యుద్ధం ఆపేశానంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆగిపోతే ట్రంప్.. వార్-2 ని కూడా ఆపానని చెప్పుకుంటారు. మొత్తానికి వాణిజ్య సుంకాలతో అంతర్జాతీయంగా అతి పెద్ద వాణిజ్య యుద్ధాన్ని మొదలు పెట్టిన ట్రంప్.. ఇలా దేశాల మధ్య యుద్ధాలను ఆపేందుకు మాత్రం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారనమాట.