అమెరికాకు, రష్యాకు మధ్య ప్రస్తుతానికి ప్రత్యక్షంగా గొడవలేం లేవు. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించిన ట్రంప్ తన అహం దెబ్బతినడంతో మరింత వైల్డ్ గా మారాడు. నిప్పుతో చెలగాటం ఆడుతున్నారంటూ రష్యాని హెచ్చరించాడు. మిగతా దేశాలయితే అమెరికా హెచ్చరికతో కాస్తంత భయపడేవి. కానీ అక్కడుంది రష్యా. ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇంకాస్త ఘాటుగా బదులిచ్చాడు. WW-III. దీని అర్థం తెలుసుకుంటే మంచిదంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. వరల్డ్ వార్ -3 అంటూ ఆయన చేసిన హెచ్చరికలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ సంగతి పక్కనపెడితే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మరింత ముదరడం ఆందోళనకలిగించే విషయం.
నిప్పుతో చెలగాటం..
భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పుకుంటున్న ట్రంప్.. ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభించారు. 2022నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగా, దాన్ని తాను ఆపేస్తానంటూ సెల్ఫ్ ఎలివేషన్లు ఇచ్చుకున్నారు. అమెరికా అధ్యక్షపీఠం ఎక్కడానికి ముందే ట్రంప్.. ఆ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పిన ట్రంప్.. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్ లో మాట్లాడారు. యుద్ధం ఆపేయాలని చెప్పారు. పుతిన్ కూడా ఈ ఫోన్ కాల్ పై పాజిటివ్ గా స్పందించాడు. ట్రంప్ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నామని తెలిపాడు. కానీ వ్యవహారం బెడిసికొట్టింది. ఆ తర్వాత అమెరికాకు సంబంధించి గోల్డెన్ డోమ్ నిర్మాణానికి ట్రంప్ నిర్ణయం తీసుకోవడం ప్రపంచ దేశాలకు నచ్చలేదు. ముఖ్యంగా చైనా, రష్యా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించాయి. ఈ సంగతి పక్కనపెడితే.. అసలు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం కూడా రష్యాకు ఇష్టం లేదని తేలిపోయింది. దీంతో ట్రంప్ మరోసారి తెరపైకి వచ్చారు. రష్యా నిప్పుతో చెలగాడం ఆడుతోందని హెచ్చరించాడు ట్రంప్.
రష్యా సైనికుల మోహరింపు
ట్రంప్ హెచ్చరికల తర్వాత రష్యా మరింత రెచ్చిపోవడం విశేషం. ఉక్రెయిన్ సమీపంలో మాస్కో 50,000 మంది సైనికులను మోహరించింది. దీంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఇరు దేశాలు సరిహద్దుల్లో డ్రోన్లను మోహరించాయి. రాత్రిపూట 13 ప్రాంతాలలో 296 ఉక్రేనియన్ డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా చెప్పింది. మరోవైపు రష్యా కూడా 88 డ్రోన్‌లు, 5 బాలిస్టిక్ క్షిపణులను తమపై ప్రయోగించిందని ఉక్రెయిన్ తెలిపింది. పశ్చిమ కుర్స్క్ ప్రాంతం నుంచి ఉక్రేనియన్ దళాలను తరిమికొట్టి, ఆ తర్వాత ఈశాన్య ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలోకి రష్యా దళాలు ప్రవేశించాయి, అక్కడి గ్రామాలను ఆక్రమించాయి.
వరల్డ్ వార్-3
ఇటు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మళ్లీ ఉధృతమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అటు అమెరికా-రష్యా మధ్య మాయల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. నిప్పుతో చెలగాటం ఆడుతున్నారంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రష్యా మాజీ అధ్యక్షుడు, దిమిత్రి మెద్వెదేవ్ ఘాటుగా స్పందించారు. WWIII అంటూ ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. వరల్డ్ వార్ -3 అనివార్యం అన్నట్టుగా ఆయన స్పందించడంతో అటు అమెరికా కూడా అలర్ట్ అయింది. మెద్వెదేవ్ పోస్ట్ నిర్లక్ష్యంతో కూడుకుని ఉన్నదని ట్రంప్ రాయబారి కీత్ కెల్లాగ్ స్పందించారు. మూడో ప్రపంచ యుద్ధం గురించి భయాందోళనలు రేకెత్తించడం దురదృష్టకరం అని ఆయన అన్నారు.
Regarding Trump's words about Putin "playing with fire" and "really bad things" happening to Russia. I only know of one REALLY BAD thing — WWIII.
I hope Trump understands this!— Dmitry Medvedev (@MedvedevRussiaE) May 27, 2025
ఇటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అటు రష్యా-అమెరికా మాటల యుద్ధం.. వెరసి మూడో ప్రపంచ యుద్ధం అంటూ రష్యా మాజీ అధ్యక్షుడి ట్వీట్.. ఈ వ్యవహారం అంతా ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్షుడి దుందుడుకు చర్యలు చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తేలాల్సి ఉంది.