Green Rail Initiative: ఇండియన్ రైల్వే పరిశుభ్రత వైపు మరో కీలక అడుగు వేసింది. ఈసారి అధునాతన టెక్నాలజీ వైపు అడుగులు వేసి విజయాన్ని అందుకుంది. విదేశీ రైల్వేలకు ఏమాత్రం తీసిపోమని, ఇప్పటికే వందే భారత్ రైళ్లతో నిరూపించుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రైల్వేల పరిశుభ్రత వైపు దృష్టి సారించిన రైల్వే కీలక ప్రయత్నంతో విజయం అందుకుంది. అసలు ఏంటా విజయం అనేది తెలుసుకుందాం.
ఇండియన్ రైల్వే కు అనుసంధానంగా బనారస్ లోకోమోటివ్ వర్క్స్ ఉందన్న విషయం తెలిసిందే. ఇది మన ఇండియన్ రైల్వే ఉత్పత్తి యూనిట్. దీనినే బరేకా అని కూడా అంటారు. ఈ యూనిట్ ద్వారా బిఎల్డబ్ల్యూ, లోకో మోటివ్ లను ఉత్పత్తి చేస్తారు. వీటిని విదేశాలకు కూడా విక్రయించడం బనారస్ లోకోమోటివ్ వర్క్స్ యొక్క స్పెషాలిటీ. ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు కనుగొనడంలో ఇది దిట్ట. తాజాగా బిఎల్డబ్ల్యూ నూతన ఆవిష్కరణ చేసింది.
అదేమిటంటే..
సాధారణంగా మనం రైళ్లలో ప్రయాణించే సమయంలో మూత్ర విసర్జనకు వెళ్ళిన సమయంలో నీరు అందుబాటు లేక ఇబ్బందులకు గురవుతుంటాము. అంటే మూత్ర విసర్జన తర్వాత నీరు వేయని పక్షంలో దుర్వాసన రావడం కామన్. అలాంటి సమయంలో ఇతర ప్రయాణికులు మూత్ర విసర్జనకు వెళ్లిన సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి కష్టాలకు ఇప్పుడు బరేకా ఫుల్ స్టాప్ పెట్టింది. రైల్వేలో పరిశుభ్రత వైపు మరో ముందడుగు వేసింది బరేకా. బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బరేకా) ఇటీవల తయారుచేసిన WAG-9 లోకోమోటివ్ నం. 43929 లో తొలిసారిగా వాటర్‌లెస్ యూరినల్ వ్యవస్థను అమలు చేసింది. ఈ లోకో భారత రైల్వేలో పరిశుభ్రత పరంగా వినూత్న ఆవిష్కరణకు మారుపేరైంది.
నీరు అవసరం లేదు.. అదే క్లీన్ ఇక
ఈ ప్రాజెక్ట్ బనారస్ లోకోమోటివ్ వర్క్స్ జనరల్ మేనేజర్ నరేష్ పాల్ సింగ్ నేతృత్వంలో విజయవంతమైంది. రైల్వే బోర్డు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ఈ కొత్త మోడల్ లోకోలో కొత్త హ్యాండ్ బ్రేక్ వ్యవస్థ, CO2 సిలిండర్‌కు మెషిన్ రూమ్ యాక్సెస్ వంటి ఆధునిక సదుపాయాలు అమలయ్యాయి. ఈ లోకో ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో అమర్చిన వాటర్‌లెస్ టాయిలెట్ నీటి అవసరం లేకుండా పని చేస్తుంది. దీని వల్ల నీటి వినియోగం తగ్గి, పరిశుభ్రతను మెరుగుపరచే అవకాశముంది.
Also Read: National Highways: ఏపీకి భారీ గిఫ్ట్.. జస్ట్ గంటన్నరలో నెల్లూరుకు.. ఇదేం రోడ్డు బాబోయ్..
పైగా ఈ టాయిలెట్‌ను లోకో ఆకృతిలో ఎలాంటి మార్పులు చేయకుండా అమర్చేలా ప్రత్యేకంగా 180 మిల్లీమీటర్ల లోతు గల స్థలం క్యాబిన్‌లో గుర్తించారు. ఈ కొత్త వ్యవస్థ రైల్వే సిబ్బందికి నాణ్యమైన పరిశుభ్రత సదుపాయం కల్పించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా సహాయపడుతుంది. CO2 సిలిండర్‌ను తలుపు తెరవకుండానే యాక్సెస్ చేసుకునే విధంగా డిజైన్ చేయడం వల్ల భద్రతతో పాటు పనితీరులో చురుకుతనం వస్తుంది.
భవిష్యత్ లో అన్ని రైళ్లలో..
ఈ ప్రయోగం కేవలం ఒక లోకోకే పరిమితం కాకుండా, బరేకా ఇప్పటికే 37 WAG-9 ఫ్రైట్ లోకోమోటివ్‌లు, 2 WAP-7 ప్యాసింజర్ లోకోలలో ఇదే విధంగా టాయిలెట్ వ్యవస్థను అమర్చింది. ఇది పరిశుభ్రతను పెంచడంలో భారత రైల్వేకు చారిత్రాత్మక అడుగుగా చెప్పవచ్చు. ఈ చర్య క్లీన్ ఇండియా మిషన్, గ్రీన్ రైల్ లక్ష్యాలకు అనుగుణంగా సాగుతోంది. రైల్వేలోని ఉద్యోగులకు శుభ్రత, శుభ్రత పని వాతావరణం కల్పించాలన్న సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌లో ఇతర లోకోమోటివ్ వర్క్‌షాప్‌లు కూడా బరేకా మాదిరిగా ఈ ప్రయోగాన్ని అనుసరించే అవకాశం ఉంది. దీనివల్ల రైల్వే వ్యవస్థ మరింత సుసంపన్నంగా, పర్యావరణ అనుకూలంగా మారే అవకాశముంది.