Bangladesh: బంగ్లాదేశ్‌లో అల్లర్లతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి.. తాత్కాలిక ప్రభుత్వం అధికారంలో ఉన్నది. తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ ఆ దేశంలోని హిందువులకు ఓ విజ్ఞప్తి చేశాడు. అజాన్, నమాజ్‌లు చేసేటప్పుడు దుర్గా పూజ కార్యక్రమాలు చేపట్టరాదని కోరాడు. బంగ్లాదేశ్‌లో సుమారు రెండు నెలలపాటు తీవ్రంగా జరిగిన అల్లర్ల ప్రభావం ఇంకా పోలేదు. ఇప్పటికీ ఆ దేశంలో పరిస్థితులు సుస్థిరంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దుర్గా పూజా కార్యక్రమాలతో మళ్లీ రెండు వర్గాల మధ్య వైషమ్యాల చెలరేగే ముప్పు ఉన్నదనే
ఆందోళనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఆ దేశంలోని హిందువులను ఈ మేరకు రిక్వెస్ట్ చేసింది.
నమాజ్ జరుగుతుండగా.. అజాన్ సమయానికి ఐదు నిమిషాల ముందు నుంచి దుర్గా పూజా కార్యక్రమాలకు సంబంధించిన సందడిని ఆపేయాలని హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) మొహమ్మద్ జహంగీర్ ఆలం చౌదరి పేర్కొన్నారు.
తమ విజ్ఞప్తిని ఇది వరకే కమిటీలకు తెలియజేశామని, అందుకు వారు అంగీకరించారని హోం వ్యవహారాల శాఖ సలహదారు తెలిపారు. అజాన్, నమాజ్ సమయంలో దుర్గా పూజ మంటపాల్లోని మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, సౌండ్ సిస్టమ్‌లు ఆపేయడానికి వారు అంగీకారం తెలిపారని వివరించారు.
అంతేకాదు, ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల సమయంలో హిందూ సమాజానికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని చౌదరి హామీ ఇచ్చారు. అన్ని పూజా మంటపాల వద్ద 24 గంటలు భద్రత కల్పిస్తామని తెలిపారు. విగ్రహ నిర్మాణం మొదలు.. పూజా కార్యక్రమాలు పూర్తిగా ముగిసేవరకూ రక్షణ అందిస్తామని చెప్పారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా దుర్గా పూజా వేడుకలు జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.
Also Read: Sitaram Yechury: ఇందిరా గాంధీతో రాజీనామా చేయించిన సీతారాం ఏచూరి.. మరిన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం
అక్టోబర్ 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దుర్గా పూజా వేడుకలు నిర్వహించనున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ పూజా మంటపాలు ఏర్పాటు చేసుకుని వేడుకలు నిర్వహించనున్నారు. గతేడాది 33431 దుర్గా పూజా మంటపాలను నిర్వహించారు. ఈ ఏడాది కంటే ఎక్కువ మంటపాలు ఏర్పాటు కాబోతున్నట్టు తెలుస్తున్నది.
బంగ్లాదేశ్.. మత సామరస్యత కలిగిన దేశం అని ముహమ్మద్ యూనస్ ఓ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలను వేటినీ తాము ఉపేక్షించబోమని చెప్పారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పోరాడి మరణించిన జవాన్లు కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి బంగ్లాదేశ్‌లో తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ ఆందోళనలను అంతే కఠినంగా అణచివేయడానికి అప్పటి షేక్ హసీనా ప్రభుత్వం ప్రయత్నించింది. అయినా.. ఆ ఆందోళన సమసిపోలేదు. మరింత ఉధృతమైంది. అది కేవలం పట్టణ కేంద్రాలకే కాకుండా గ్రామీణంలోకి కూడా పాకింది. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో కలుగజేసుకుని ఆ రిజర్వేషన్ తగ్గిస్తూ తీర్పు ఇచ్చింది. అయినా.. ఆందోళనల చల్లారలేదు. దీంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వదిలి భారత్‌లో అడుగుపెట్టింది. ముహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పడే వరకు ఈ తాత్కాలిక ప్రభుత్వం అమల్లో ఉండనుంది.