Beijing on US Taiwan : ద్వీప దేశమైన తైవాన్ భద్రతకు చైనా తీవ్ర ముప్పుగా మారిన వేళ.. అగ్ర రాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. తైవాన్ కు 1.988 బిలియన్ల డాలర్ల ఆయుధాలు విక్రయించేందుకు అంగీకరించింది. ఈ మేరకు యుఎస్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ అక్టోబర్ 26న ప్రకటన విడుదల చేసింది. తైవాన్ భద్రతకు తాము పూర్తి రక్షణగా ఉంటామని మొదటి నుంచి చెబుతున్న అమెరికా.. అందుకు తగ్గట్లుగానే చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ కీలక ఆయుధాలను అందించేందుకు ముందుకు వచ్చింది. అయితే.. దీనిపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి స్పందించారు. అమెరికా చర్యలు చైనా సార్వభౌమత్వాన్ని, జాతీయ భద్రతను దెబ్బతీసేలా ఉందని వ్యాఖ్యానించింది. ప్రస్తుత ఒప్పందంతో ఒకే దేశం – ఒకే చైనా సూత్రాన్ని యూఎస్ తీవ్రంగా ఉల్లంఘించినట్లు తాము భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ చర్యల కారణంగా చైనా-యుఎస్ సంబంధాలు దెబ్బతినే అవకాశాలున్నాయని తెలిపింది.
ఈ ఒప్పందం ద్వారా తైవాన్ కు మేలు చేశామని అమెరికా భావిస్తోందని… కానీ తైవాన్ జలసంధిలో శాంతి భద్రతల సమస్యకు ఈ చర్యలే ప్రధాన కారణాలుగా నిలిచే అవకాశమున్నట్లు వెల్లడించింది. తమ భూభాగమైనా తైవాన్ కు అమెరికా ఇలా ఆయుధాలు అందించడం ద్వారా స్వాతంత్ర్య తైవాన్ కోసం పోరాడుతున్న వేర్పాటువాద శక్తులకు మద్ధతుగా నిలిచినట్లేనని చైనా విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే తైవాన్‌కు ఆయుధాలు అందించడాన్ని ఆపివేయాలని, తమ ప్రాంత శాంతి, సుస్థిరతకు భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని అమెరికాకు గట్టిగా సూచించింది. చైనా తన రక్షణ, తన భూభాగాల భద్రత కోసం ఎంత దూరమైనా వెళతామన్న చైనా.. తన భద్రతా, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
ఇటీవల కాలంలో తైవాన్ ను ఆక్రమించుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. నిత్యం తైవాన్ భూభాగంలోకి తన యుద్ధ విమానాలను పంపిస్తూ.. కవ్వింపు చర్యలకు పాల్పడడంతో పాటు తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాల పేరుతో భయపెట్టేందుకు ప్రత్నిస్తోంది. ఎవరైనా ఇతర దేశాల అధికార ప్రతినిధులు తైవాన్ ను సందర్శించిన తీవ్ర నిరసనలు తెలుపుతూ.. తైవాన్ తన భూభాగమంటూ అదరగొడుతోంది. ఇటీవలే.. చైనా అధ్యక్షుడు షీ జింగ్ పింగ్.. యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ తన సైన్యానికి ఆదేశాలు జారీ చేశాడు. ఎప్పుడు యుద్ధం వచ్చినా తయారుగా ఉండాలంటూ సూచించాడు. ఈ పరిస్థితుల్లో తైవాక్ తో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం చైనాకు ఇబ్బంది పెట్టిదిగానే నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Also read : పుతిన్, ఎలన్ మస్క్ మధ్య రెండేళ్లుగా సంప్రదింపులు.. తైవాన్‌పై చైనా కుట్ర?
ప్రస్తుత ఒప్పందంలో ల్యాండ్ టూ ఎయిర్ మిస్సైళ్లు, అత్యాధునిక రాడార్ సిస్టమ్స్‌తో సహా మరిన్ని ఆయుధలను ఉన్నట్లు పెంటగాన్ తెలిపింది. యూఎస్ డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (DSCA) ప్రకటన ప్రకారం, తైవాన్‌కు తాజా ఆయుధ విక్రయ ప్యాకేజీలో 828 మిలియన్ డాలర్లు విలువైన.. AN/TPS-77,AN/TPS-78 రాడార్ టర్న్‌కీ సిస్టమ్స్, దానికి సంబంధించిన పరికరాలు ఉండనున్నాయి. వీటితో పాటుగా USD 1.16 బిలియన్ డాలర్ల విలువ చేసే నేషనల్ అడ్వాన్స్‌డ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ సిస్టమ్, అనుబంధ పరికరాలు ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నీ మీడియం-టు లాంగ్-రేంజ్ ఎయిర్ నిఘా కోసం మల్టీ మిషన్, గ్రౌండ్-బేస్డ్ రాడార్ వ్యవస్థలతో అనుసంధానంగా పని చేస్తాయి. తాజా కొనుగోళ్ల కారణంగా.. తైవాన్ రక్షణ సామర్థ్యం పెరుగుతుందని, ప్రాంతీయ ఉద్రిక్తల సమయంలో తన స్వాతంత్ర్యాన్ని కాపాడుకునేందుకు ఉపయోగపడతాయని DSCA పేర్కొంది.