
Richard Branson cycling Accident : డేర్‌డెవిల్‌గా పేరొందిన బిలియనీర్, వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడు సర్ రిచర్డ్ బ్రాన్సన్ మరోసారి ప్రమాదానికి గురయ్యారు. 73 ఏళ్ల బ్రాన్సన్‌కు ప్రమాదాలు కొత్త కావు. ఆయన మరణం అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తన జీవితంలో ప్రమాదాల నుంచి బయటపడటం ఆయనకిది 76వ పర్యాయం.
బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో ఒకటైన వర్జిన్ గోర్డాలో సైక్లింగ్ చేస్తుండగా పెద్ద గుంతలో పడిపోవడంతో బ్రాన్సన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అలెక్స్ విల్సన్‌తో సైక్లింగ్ చేస్తున్న సమయంలో తాజాగా ప్రమాదానికి గురయ్యాయనంటూ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తన వెనుకే వస్తున్న అలెక్స్ విల్సన్ కూడా కింద పడటంతో గాయాలయ్యాయని, తన ముంజేయి, కటిభాగాల్లో తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఆ ఘటన తాలూకు ఫొటోలను కూడా షేర్ చేశారు.
వర్జిన్ ఐలాండ్స్‌లో బ్రాన్సన్ ప్రమాదానికి గురి కావడం ఇదే మొదటిసారి కాదు. 2018లో ఓ చారిటీ రేసులో పాల్గొన్న సందర్భంగా ఆయన వెన్నెముకకు గాయమైంది. అంతకు ముందు 2016లో ఓ ప్రమాదంలో తల నేరుగా , బలంగా రోడ్డును తాకింది.ఆయనకు మరణం తప్పదని అందరూ అనుమానించారు.అదృష్టవశాత్తు అప్పుడాయన మృత్యువు నుంచి తప్పించుకోగలిగారు 1972లో మొదటి భార్యతో కలిసి బ్రాన్సన్ ప్రయాణిస్తున్న ఫిషింగ్ బోట్ మునిగిపోయింది.
1976లో ఆయన ప్రయాణిస్తున్న మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటన నుంచి కూడా ప్రాణాలతో బయటపడ్డారు. 1986లో స్కైడైవింగ్ లో పొరపాటు చేయగా… బ్రాన్సన్‌ను ఆయన ఇన్‌స్ట్రక్టర్ రక్షించారు.
హాట్ బెలూన్లు, వర్జిన్ అట్లాంటిక్ విమానం రెక్కలపై నడవడం, లాస్ వెగాస్‌లోని పామ్స్ కేసినో నుంచి దూకడం వంటి సాహసాలనూ ఆయన చేశారు. ఆయా సమయాల్లో బ్రాన్సన్ త్రుటిలో ప్రమాదాల నుంచి తప్పించుకోగలిగారు.