KG Tomatoes Rs 600: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఆఫ్ఘన్ పై పాక్ వైమానిక దాడి నేపథ్యంలో రెండు దేశాల సరిహద్దు వాణిజ్యం నిలిచిపోయింది. పాక్, ఆఫ్ఘన్ రెండు దేశాల్లోనూ నిత్యావసర వస్తువుల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. 2,600 కి.మీ సరిహద్దు ప్రాంతంలో ఘర్షణ వాతావరణ నెలకొనడంతో అక్టోబర్ 11 నుంచి బోర్డర్లు మూసివేశారు. బోర్డర్ షట్‌డౌన్ కూరగాయల ధరలు ముఖ్యంగా టమోటాలు, పండ్ల ధరలు భారీగా పెరిగాయి.
‘పాక్-ఆఫ్ఘన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి వాణిజ్యం, రవాణా నిలిచిపోయాయి. రోజులు గడిచే కొద్దీ ఈ నష్టం ఎక్కువ అవుతుంది. రెండు వైపులా దాదాపు రోజుకు 1 మిలియన్ డాలర్లు నష్టపోతున్నాయి’ అని వ్యాపారస్తులు అంటున్నారు. తాజా పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, మందులు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు రెండు దేశాల మధ్య ఎగుమతి, దిగుమతిల పేరిట ఏడాదికి 2.3 బిలియన్ల డాలర్ల వాణిజ్యం జరుగుతుందని పాకిస్తాన్-ఆఫ్ఘన్ చాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది.
పాకిస్తాన్ ప్రజల రోజువారీ ఆహారంలో కీలకమైన టమాటాలు ధరలు 400% కంటే ఎక్కువ పెరిగి కిలోకు రూ.600(పాకిస్తాన్ కరెన్సీ) చేరుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి టమాటాల లోడ్ లు నిలిచిపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయని వ్యాపారులు అంటున్నారు. వెల్లుల్లి కిలోకు రూ. 400, అల్లం కిలో రూ. 750కి పెరిగింది. ఉల్లిపాయలు కిలోకు రూ. 120, బఠానీలు కిలోకు రూ. 500 రిటైల్ ధరలు పలుకుతున్నాయి.
బెండకాయలు, క్యాప్సికమ్ కిలోకు రూ. 300లకు చేరాయి. దోసకాయలు కిలోకు రూ. 150, రెడ్ క్యారెట్లు కిలోకు రూ. 200లకుచేరాయి. నిమ్మకాయలు కిలోకు రూ. 300, కొత్తి మీర చిన్న కట్ట రూ. 50 ఖర్చవుతుందని పాక్ వార్తా పత్రికలు తెలిపాయి. ఆప్ఘన్ లో దాదాపు 500 కంటైనర్ల కూరగాయలు ఉన్నాయి, అవన్నీ చెడిపోయాయని ఆ దేశ వ్యాపారులు చెబుతున్నారు. పాకిస్తాన్ సరిహద్దు క్రాసింగ్ వద్ద రెండు వైపులా దాదాపు 5,000 కంటైనర్లు రవాణా నిలిచిపోయాయని ఓ పాక్ అధికారి చెప్పారు. మార్కెట్లో టమాటాలు, ఆపిల్స్, ద్రాక్ష కొరత ఉందన్నారు.
పాకిస్తాన్ పై దాడి చేసేందుకు సరిహద్దు దాటుతున్న ఉగ్రవాదులపై చర్య తీసుకోవాలని పాక్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వాన్ని కోరింది. ఇలా కోరిన రోజుల వ్యవధిలోనే పాక్ ఆఫ్ఘన్ పై వైమానిక దాడి చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంలో పాక్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య కాల్పుల విరమణ చర్చలు కొనసాగుతున్నాయి. అయితే వాణిజ్యంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. తదుపరి రౌండ్ చర్చలు ఇవాళ ఇస్తాంబుల్‌లో జరగనున్నాయి.
Also Read: Dubai Gold Dress: ప్రపంచంలోనే అత్యంత బరువైన గోల్డ్ డ్రెస్.. దీని ఖరీదు ఎంతంటే..