Big Stories

Faultline : సునామీ ముప్పులో అమెరికన్లు

Faultline

Faultline : వేల సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయిన ఫాల్ట్‌లైన్ అది. భూమిలోపల 72 కిలోమీటర్ల మేర విస్తరించిన ఆ లైన్ ఇప్పుడు అమెరికా, కెనడా వాసులను బెంబేలెత్తిస్తోంది. పది లక్షల మందికిపైగా అమెరికన్లకు సునామీ ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాని వల్ల అటు కెనడాలోనూ భారీ భూకంపం సంభవించే ప్రమాదం ఉంది.

- Advertisement -

కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఈ ఫాల్ట్‌ లైన్ వెలుగులోకి వచ్చింది. దాంతో వచ్చే భారీ భూకంపం ప్రభావం వల్ల జార్జియా బేసిన్‌లో సునామీకి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇటు వాషింగ్టన్‌తో పాటు అటు బ్రిటిష్ కొలంబియాను కూడా ఆ సునామీ కకావికలం చేసే అవకాశం ఉంది. ఫ్రాన్స్‌లోని గ్రెనోబుల్ ఆల్ప్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఆ ఫాల్ట్‌లైన్‌ను గుర్తించగలిగారు.

- Advertisement -

వేల సంవత్సరాల క్రితమే ఆ ప్రాంతంలో రెండు భారీ ఫలకాలు ఒకదానినొకటి రాపిడికి గురి కావడంతో భారీ భూకంపం సంభవించి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. తాజా ఫాల్ట్‌లైన్ మాత్రమే కాకుండా ఎన్నో ఫాల్ట్‌లైన్స్‌కు పసిఫిక్ ఆగ్నేయ ప్రాంతం కేంద్రం. కొత్తగా కనుగొన్న ఫాల్ట్‌లైన్‌‌కు XELF(XEOLXELEK-Elk Lake Fault) అని పేరు పెట్టారు. ఇది డిప్-స్లిప్ ఫాల్ట్ కేటగిరీలోకి వస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ రకం ఫాల్ట్‌లో రాతి ఫలకాలు పైకి, కిందకు కదులుతుంటాయి. ఈ నిట్టనిలువు కదలిక వల్ల జార్జియా బేసిన్‌లో సునామీ వచ్చే అవకాశాలు పెరుగుతాయని అంచనా.

భూమి పైపొరల్లో 16 ప్రధాన ఫలకాలు ఉన్నాయి. రెండు ఫలకాలు కలిసే చోటును ఫాల్ట్ అని పిలుస్తారు. ఇవి వేర్వేరు దిశల్లో కదులుతుంటాయి. సాధారణంగా ఆ కదలిక కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. అయితే ఒక్కోసారి రెండు ఫలకాల్లో ఒకటి వేగంగా కదలడం లేదా కిందకు ఒరగడంతో భారీ శక్తి వెలువడుతుంది. ఫలితంగా భూకంపాలు సంభవిస్తుంటాయి.

అయితే అన్ని ఫాల్ట్‌లైన్స్‌లో భూకంపాలు వస్తాయన్న నిబంధన ఏదీ లేదు. చాలా ఫాల్ట్‌లలో అసలు భూకంపాలే రావు. కానీ చిన్న చిన్న ప్రకంపనలు వస్తుంటాయి. పసిఫిక్ మహాసముద్రంలో 80% భూకంపాలు రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతంలోనే సంభవిస్తుంటాయి. ఇక్కడ పసిఫిక్ ఫలకం అంచులు మిగతా ఫలకాలతో రాపిడికి గురవుతూ ఉంటాయి. భూకంపాల్లో ఎక్కువ భాగం టెక్టానిక్ ప్లేట్ల బౌండరీల్లోనే వస్తుంటాయి.

XELF ఫాల్ట్‌లైన్‌ వద్ద రెండు ఫలకాల్లో ఒకటి పైకి కదులుతోంది. దీని వల్ల హారో స్ట్రెయిట్‌లోని సముద్రగర్భం పైకి ఉబికితే.. దానిని ఆవరించి ఉన్న నీరంతా ఎగసి జార్జియా బేసిన్ చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తుతుంది. సముద్రగర్భం కొన్ని మీటర్ల మేర పైకి తన్నుకు వచ్చినా చాలు.. ఆ వేగం కారణంగా వేల క్యూబిక్ కిలోమీటర్ల నీరు పైకి ఎగసి పరిసరాలను అలల రూపంలో ముంచెత్తేస్తాయి. భూకంప కేంద్రం నుంచి సునామీ అలలు అన్ని దిక్కులకూ విస్తరిస్తాయని పరిశోధకులు వివరిస్తున్నారు.

జార్జియా బేసిన్ పరిధిలో బెల్లింగ్‌హామ్, సియాటెల్, టకోమా, ఒలింపియా వంటి అమెరికా నగరాలు, కెనడాలోని వాంకూవర్, విక్టోరియా, విజలర్ నగరాలు ఉన్నాయి. XELF ఫాల్ట్‌లైన్‌ వల్ల గత 12 వేల సంవత్సరాల్లో భూకంపం వచ్చి ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. అంత తీవ్రతతోనే మరోసారి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని తమ పరిశోధనలో తేలిందని చెప్పారు. ఆ ప్రాచీన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 6.1 నుంచి 7.6 తీవ్రతతో ఆ ప్రాంతాన్ని కుదిపేసి ఉంటుందని రిసెర్చర్లు లెక్కించి చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News