China Army : ఒకవైపు చర్చలు అంటూనే… మరోవైపు కవ్వించడం చైనా ఆర్మీకి అలవాటే. అలాగని శత్రువులతో డైరెక్టుగా తలపడదు. దొంగ చాటుగా భూభాగాలను ఆక్రమించడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. మరోవైపు లేటెస్ట్ టెక్నాలజీని సమకూర్చుకుంటోంది. అందులో భాగంగానే ఇప్పుడో సరికొత్త రోబోను రూపొందించింది. అదే దాడి చేసే రోబో డాగ్. సైనికుల్లాగే తుపాకీని ఎక్కుపెట్టి శత్రువులను మట్టుబెట్టే సామర్థ్యం దీని సొంతం. శత్రువులు ఎక్కడ దాక్కున్నా… వెతికిమరీ దాడి చేస్తుంది. దీని గురి తప్పదు.
ఇప్పుడీ రోబో శునకాలు చైనీస్ మిలటరీకి అదనపు బలంగా మారాయి. మిషన్ గన్ తో పోరాటం చేసే కుక్కలను చూశాం. అయితే చైనా మరో అడుగు ముందుకేసింది. శునకాల ప్లేస్ లో డాగ్ రోబోలను రంగంలోకి దింపింది. వాటికి చెనాకు చెందిన క్యూబీబీ-97 అనే లైట్ మషీన్ గన్ ను అమర్చినట్లు భావిస్తున్నారు. దీని ఫైరింగ్ సామర్థ్యం చాలా ఎక్కువ. 400 మీటర్ల రేంజ్ లో నిమిషానికి 650 రౌండ్ల కాల్పులు జరిపే కెపాసిటీ ఉంది.
శత్రువులు ఉండే ప్రాంతాల్లో ఈ రోబో డాగ్ లను డ్రోన్లతో వదిలిపెడతారు. శునకాన్ని వదిలిపెట్టగానే డ్రోన్ వచ్చిన దారినే వెళ్లిపోతుంది. డ్రోన్ వదిలిపెట్టగానే రోబో డాగ్ జూలు విదుల్చుతుంది. నిజమైన కుక్క క్షణాల్లో పైకి లేచి ఎలాగైతే దాడి చేస్తుందో… ఇది కూడా సేమ్ అలాగే చేస్తుంది. శత్రువులపై నిఘా పెడుతుంది. వారిపై టార్గెట్ ఫిక్స్ చేస్తుంది. గన్ ఎక్కుపెట్టి బుల్లెట్లు పేలుస్తుంది. ఆ టార్గెట్ పూర్తికాగానే మరో శత్రువు కోసం సెర్చ్ మొదలు పెడుతుంది. శత్రువులకు సైతం అర్థంకాని రీతిలో వ్యూహాత్మకంగా ఆకస్మిక దాడులు చేస్తుంది. ఇలా వరుసగా శత్రువులను మట్టుబెడుతూ ముందుకు సాగిపోతుంది.
డాగ్ రోబో వీడియోను చైనా మిలటరీకి అనుబంధంగా ఉండే కెస్ట్రెల్ డిఫెన్స్ బ్లడ్-వింగ్ కి సంబంధించిన విబో అకౌంట్ ద్వారా… ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడీ డాగ్ గన్ చైనాతో సరిహద్దు వివాదం ఉన్న భారత్ లాంటి దేశాలకు పక్కలో బల్లెంలా తయారైంది.