T20 WorldCup : T20 వరల్డ్ కప్ లో గ్రూప్ 1లోని జట్లపై వరుణుడు పగబట్టినట్టు ఉన్నాడు. వాన దెబ్బకు ఇప్పటిదాకా గ్రూప్ 1లో మూడు మ్యాచ్ లు రద్దైపోవడంతో… జట్ల సెమీస్ అవకాశాలు సంక్షిష్టంగా మారుతున్నాయి.
గ్రూప్ 1లో శుక్రవారం జరగాల్సిన 2 మ్యాచ్ లు… వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి. ఒక్క బంతి కూడా పడకుండానే రద్దై పోయాయి. దాంతో.. 4 జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. వర్షం కారణంగా గ్రూప్ 1లో 3 మ్యాచ్ లు రద్దైతే… అందులో రెండు ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లే ఉన్నాయి. ఒక మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన ఆప్ఘన్… న్యూజిలాండ్, ఐర్లాండ్ లతో మ్యాచ్ లు రద్దైపోవడంతో రెండు పాయింట్లు పంచుకుంది. గ్రూప్ 1లో చివరిస్థానంలో ఉన్న ఆప్ఘన్ సెమీస్ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్టే. ఎందుకంటే…
ఆప్ఘనిస్తాన్ తన మిగతా రెండు మ్యాచ్ ల్ని బలమైన ఆస్ట్రేలియా, శ్రీలంకలతో ఆడాల్సి ఉంది. వీటిలో ఏ ఒక్క మ్యాచ్ లో ఓడినా ఆఫ్గనిస్తాన్ ఇంటికెళ్లాల్సిందే.
ఇక… హోరాహోరీగా సాగుతుందని అభిమానులు భావించిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది. దాంతో… ఇంగ్లిష్ టీమ్ కొంప మునిగేలా ఉంది. ఓ మ్యాచ్ లో గెలిచి, ఓ మ్యాచ్ లో ఓడి.. మరో మ్యాచ్ రద్దు కావడంతో… ప్రస్తుతం ఇంగ్లండ్ 3 పాయింట్లతో ఉంది. ఇంగ్లండ్ తన తర్వాతి రెండు మ్యాచ్ లను న్యూజిలాండ్, శ్రీలంకతో ఆడాల్సి ఉంది. వీటిల్లో ఏ ఒక్కదానిలో ఓడినా… ఇంగ్లండ్ ఖేల్ ఖతమే. ఆస్ట్రేలియాకు మాత్రం సెమీస్ చేరేందుకు బెటర్ ఛాన్సులే ఉన్నాయి. తన మిగతా రెండు మ్యాచ్ ల్ని ఆప్ఘన్, ఐర్లాండ్ తో ఆడాల్సి ఉండటంతో… ఆసీస్ ఏ మాత్రం కంగారు పడటం లేదు. ఈజీగా గెలిచి సెమీస్ చేరొచ్చని ఆ జట్టు భావిస్తోంది.
ఇక గ్రూప్ 1లో లక్కీ టీమ్ ఏదైనా ఉందంటే… అది ఐర్లాండే. వర్షం ఆటంకం కలిగించినా డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఇంగ్లండ్ పై గెలిచిన ఐర్లాండ్… తర్వాతి రెండు మ్యాచ్ ల్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో ఆడాల్సి ఉంది. వీటిల్లో ఏ ఒక్క మ్యాచ్ లో గెలిచినా… ఐర్లాండ్ సెమీస్ చేరే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి.