Big Stories

Pakistan : పాకిస్థాన్ కు చావుదెబ్బ

Pakistan : T20 వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదైంది. ఈసారి పాకిస్థాన్ కు షాక్ తగిలింది. పాక్ పై ఒక్క పరుగు తేడాతో నెగ్గింది… జింబాబ్వే. ఆ జట్టు విసిరిన స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక… పాకిస్థాన్ చతికిలబడింది. వరుసగా రెండు పరాజయాల కారణంగా… పాక్ సెమీస్ అవకాశాలు సంక్షిష్టంగా మారాయి.

- Advertisement -

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వేకు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్ కు 5 ఓవర్లలో 42 పరుగులు జోడించారు. అయితే ఒక్క పరుగు తేడాతో ఓపెనర్లు ఇద్దరినీ ఔట్ చేసి పాక్ బౌలర్లు ఒత్తిడి పెంచారు. దాంతో… జింబాబ్వే బ్యాటర్లు ఆచితూచి ఆడారు. క్రీజ్ లో కుదురుకున్న తర్వాత సీన్ విలియమ్స్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా… అతనికి అండగా ఎవరూ నిలవలేదు. మిల్టన్ 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. జట్టు స్కోరు 95 పరుగుల దగ్గర… 31 రన్స్ చేసిన విలియమ్స్ కూడా ఔటయ్యాడు. అదే స్కోరు దగ్గర మరో మూడు వికెట్లు పడ్డాయి. చివర్లో బ్రాడ్ ఇవాన్స్ కాస్త ధాటిగా ఆడటంతో… 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 130 రన్స్ చేసింది… జింబాబ్వే.

- Advertisement -

131 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ ను… జింబాబ్వే బౌలర్లు వణికించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో… పాక్ పరుగులు చేయడానికి తంటాలు పడాల్సి వచ్చింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. 4 రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ రిజ్వాన్ కూడా 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇఫ్తికార్ అహ్మద్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. దాంతో… 7.4 ఓవర్లలో 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది… పాకిస్థాన్. ఆ తర్వాత షాన్ మసూద్ ఒక్కడే జింబాబ్వే బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. షాదాబ్ ఖాన్ తో కలిసి నాలుగో వికెట్ కు 52 రన్స్ జోడించారు. అయితే జింబాబ్వే బౌలర్ సికందర్ రజా వరుసగా 3 వికెట్లు తీయడంతో… 15.1 ఓవర్లలో 94 రన్స్ కు 6 వికెట్లు కోల్పోయి పాకిస్థాన్ మళ్లీ ఒత్తిడిలో పడింది. చివరి 2 ఓవర్లలో 22 పరుగులు చేయాల్సి ఉండగా… 6 బంతుల్లో 11 రన్స్ తీశారు… పాక్ బ్యాటర్లు. ఇక చివరి ఓవర్లో విజయం కోసం 11 రన్స్ చేయాల్సి ఉండగా… తొలి బంతికి నవాజ్ 3 పరుగులు తీశాడు. రెండో బంతికి వసీం ఫోర్ కొట్టాడు. దాంతో రెండు బంతుల్లోనే 7 పరుగులు వచ్చాయి. ఇక విజయానికి 4 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండటంతో… పాక్ గెలుపు ఖాయమని అనుకున్నారంతా. మూడో బంతికి వసీం ఒక్క పరుగు తీశాడు. నాలుగో బంతికి పరుగులేమీ రాలేదు. రెండు బంతుల్లో విజయానికి 3 పరుగులు చేయాల్సిన సమయంలో… ఐదో బంతికి నవాజ్ ఔటయ్యాడు. దాంతో… పాక్ గెలవాలంటే చివరి బంతికి 3 పరుగులు అవసరమయ్యాయి. లాస్ట్ బాల్ కు రెండో పరుగు తీసే ప్రయత్నంలో షహీన్ షా అఫ్రీదీ రనౌట్ కావడంతో ఒక్క రన్ మాత్రమే వచ్చింది. దాంతో… ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది… పాకిస్థాన్. అనూహ్యంగా గెలిచిన జింబాబ్వే సంబరాలు చేసుకుంది. 3 కీలక వికెట్లతో పాటు చివరి బంతికి అఫ్రీదీని రనౌట్ చేసి జట్టు విజయానికి కారణమైన జింబాబ్వే బౌలర్ సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News