 
					Trump Xi Jinping Meeting: అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మధ్య ఆ దేశాధినేతలు డొనాల్డ్ ట్రంప్, షీ జిన్‌పింగ్‌ల భేటీ అయ్యారు. దక్షిణ కొరియాలో ట్రంప్, జిన్ పింగ్ గురువారం భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. జిన్‌పింగ్‌తో భేటీ అనంతరం ట్రంప్ చైనాకు గుడ్ న్యూస్ చెప్పారు. చైనాపై టారిఫ్‌లను 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
బీజింగ్ రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతిని అనుమతించిందని, అలాగే అమెరికన్ సోయాబీన్‌లను కొనుగోలు చేసేందుకు అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు. ఫెంటనిల్ తయారీకి ఉపయోగించే కెమికల్స్ చైనా విక్రయించినందుకు ఈ సంవత్సరం ప్రారంభంలో అమెరికా సుంకాలు విధించింది. ఫెంటనిల్ విక్రయాలను కట్టడి చేస్తామని చైనా హామీ ఇవ్వడంతో సుంకాలను 20% నుండి 10%కి తగ్గిస్తామని ట్రంప్ తెలిపారు. తాజా నిర్ణయంతో చైనాపై సుంకాల భారంగా 57% నుండి 47%కి తగ్గనుంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ లో తాను చైనాకు వెళతానని, ఆ తర్వాత జిన్ పింగ్ అమెరికాకు వస్తారని ట్రంప్ తెలిపారు. చైనాకు అధునాతన కంప్యూటర్ చిప్‌లను ఎక్స్ పోర్ట్ చేయడంపై చర్చించామని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. Nvidia చైనా అధికారులతో చర్చలు జరుపుతుందన్నారు. త్వరలో చైనాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేస్తామని ట్రంప్ అన్నారు. ప్రపంచంలోని రెండు ప్రముఖ ఆర్థిక వ్యవస్థలు ఘర్షణ పడటం సాధారణమేనని ట్రంప్ అన్నారు. ఈ చర్చలపై చైనా ఇంకా స్పందించలేదు.
రేర్ ఎర్త్ ఖనిజాలకు సంబంధించిన సమస్య పరిష్కారమైందని ట్రంప్ తెలిపారు. చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల ఎక్స్ పోర్టులో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఈ ఖనిజాలను ఏడాది పాటు అమెరికాకను ఎగుమతి చేసేందుకు ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. రేర్ ఎర్త్ ఖనిజాల కారణంగానే ఇటీవల ట్రంప్ చైనాపై 100 శాతం సుంకాల హెచ్చరికలు చేశారు. తాజా భేటీలో చైనాకు భారీ ఊరట లభించింది.
ఈ భేటీ అనంతరం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. జిన్ పింగ్ గొప్ప దేశాధినేత అని, ఆయనకు 10కి 12 మార్కులు ఇస్తానన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో అమెరికాతో కలిసి పనిచేసేందుకు చైనా అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు.
Also Read: Nvidia: చరిత్ర సృష్టించిన ఎన్విడియా.. 5 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరిన తొలి కంపెనీగా రికార్డు
దక్షిణ కొరియాలో ట్రంప్, జిన్ పింగ్ సుదీర్ఘంగా భేటీ అయినప్పటికీ.. ప్రధాన ఉద్రిక్తతలు మాత్రం అలానే ఉన్నాయని విశ్లేషకులు అన్నారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలపై ఆధిపత్య పోటీ కొనసాగే అవకాశం ఉందంటున్నారు. AIతో కొత్త సాంకేతికత అభివృద్ధి, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రపంచ వ్యవహారాలు ముడిపడి ఉన్నాయంటున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ సుంకాల దూకుడు పెంచారు. చైనా, భారత్ సహా చాలా దేశాలపై ట్రంప్ భారీగా సుంకాలు విధించారు.