US Visa Holders Under Surveillance| అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దేశంలో అనేక మార్పులు వచ్చాయి. ప్రత్యేకంగా, యుఎస్‌లో నివసిస్తున్న విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం విధించిన నియంత్రణలను మరింత కఠినంగా మార్చింది. గ్రీన్ కార్డ్ ఉన్నవారంతా అమెరికాలో శాశ్వత నివాసితులు కాదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవలే ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో భారత దేశానికి చెందిన లక్షలాది వలసదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే గత కొన్ని వారాలుగా అమెరికాలో వలస నియమాలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.
వీసా హోల్డర్లపై కఠిన తనిఖీలు.. సహనానికి పరీక్ష
ఈ పరిస్థితిల్లో అమెరికాలోకి ప్రవేశించే లేదా నిష్క్రమించే H-1B, F-1, గ్రీన్ కార్డ్ వీసా హోల్డర్లపై (H-1B, F-1, and Green Card visa holders) అమెరికా ఏజెన్సీలు కఠినమైన పర్యవేక్షణ చేస్తున్నాయి. వీసా హోల్డర్ల చదువు, ఉద్యోగ వివరాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. ఇది వీసాదారుల ఓర్పుకు పరీక్షగా మారుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో ఇటీవల.. గ్రీన్ కార్డ్, H-1B హోల్డర్లకు ప్రయాణ సమయంలో వారి పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరించారు. యుఎస్‌లో నివసిస్తున్న లక్షలాది భారతీయులు గ్రీన్ కార్డ్, H-1B లేదా F-1 వీసాలను కలిగి ఉన్నారు. వీరు అమెరికాకు తిరిగి వెళ్లేటప్పుడు ఎంట్రీ పాయింట్‌లో వారి పత్రాలను చూపించాల్సి ఉంటుంది.
Also Read: అమెరికా యుద్ధ ప్రణాళికలు మీడియాకు లీక్.. ట్రంప్ యంత్రాంగం నిర్లక్ష్యమే కారణం
శాశ్వత నివాసితులు, చట్టబద్ధమైన వీసాదారులు తమ నివాస స్థితి లేదా ఉద్యోగం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా, ఈ పరిశీలనలు వారికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. ప్రపంచంలోని 43 దేశాల ప్రజలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి, లేదా వారి రాకపోకలను పరిమితం చేయడానికి ట్రంప్ ప్రభుత్వం ఇటీవల చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తనిఖీలు మరీ ఎక్కువయ్యాయి. అమెరికాలో చట్టాన్ని పాటిస్తూ.. పన్నులు చెల్లించే భారతీయులపై ఎటువంటి ప్రయాణ నిషేధాలు లేకపోయినా, వారు మరింత జాగ్రత్త వహించాలని ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీలు సూచనలు చేస్తున్నాయి.
గత కొన్ని వారాలుగా ఎంట్రీ పాయింట్‌లతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు (American Embassies), కాన్సులేట్‌లలో కఠినమైన తనిఖీలు జరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎన్‌డీటీవీ ఒక రిపోర్ట్‌లో పేర్కొంది. అమెరికాకు వెళ్లేవారి డాక్యుమెంటేషన్ పరిశీలన ఇప్పుడు అనేక దశల్లో సాగుతోంది. ఇది తీవ్ర ఆలస్యానికి దారితీస్తోంది. ఫలితంగా.. దరఖాస్తుల ప్రాసెసింగ్ సమయాన్ని అధికారులు పొడిగిస్తున్నారు.
అమెరికాలో చదువుకోవడం ఇక కష్టమే
అమెరికా ఇప్పుడు విదేశీ విద్యార్థులకు కఠినమైన విధానాలు అనుసరిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో F-1 విద్యార్థి వీసాలకు 6.79 లక్షల దరఖాస్తులలో 41% (2.79 లక్షలు) తిరస్కరించబడ్డాయి – ఇది ఒక దశాబ్దంలో అత్యధిక తిరస్కరణ రేటు. భారతీయ విద్యార్థులకు జారీ అయిన వీసాల సంఖ్య 2024లో 38% తగ్గింది.
అయితే, ఓపెన్ డోర్స్ 2024 నివేదిక ప్రకారం, 3.31 లక్షల భారతీయ విద్యార్థులతో అమెరికాలో అతిపెద్ద అంతర్జాతీయ విద్యార్థి సమూహంగా నిలిచారు. విద్యార్థి వీసాల తిరస్కరణలకు కారణాలుగా ఇమ్మిగ్రేషన్ చట్టాలు, ఫెడరల్ నిబంధనలు సూచించబడుతున్నాయి. కోవిడ్ తర్వాత దరఖాస్తులు పెరిగినప్పటికీ, తిరస్కరణల శాతం గణనీయంగా పెరిగింది.