Flight Accident : విమానాలు భయపెడుతున్నాయి. హాయిగా సాగిపోతుందనుకునే జర్నీ గాల్లో దీపంలా మారుతోందా? అహ్మదాబాద్‌లో జరిగిన ఘోరం మరిచిపోకముందే, వేర్వేరు చోట్ల ప్రమాద ఘటనలు తెరపైకి వస్తున్నాయి. అమెరికాలోని బోస్టన్‌లో రన్‌వే పై నుంచి గ్రాస్ ల్యాండ్‌లోకి వెళ్లిపోయింది జెట్‌బ్లూ ఫ్లైట్.
అమెరికాలోని చికాగో నుంచి బోస్టన్‌కు వెళ్లింది జెట్‌బ్లూ 312 ఫ్లైట్. ల్యాండింగ్ సమయంలో సమస్య వచ్చింది. ఊహించని విధంగా రన్‌వే పైనుంచి పక్కకు వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎందుకిలా జరిగింది? ప్రాబ్లమ్ ఏమిటనే కోణంలో ఆల్రెడీ దర్యాప్తు మొదలు పెట్టారు. బోస్టన్ విమానాశ్రయ సిబ్బంది అలర్ట్ అయ్యారు. కార్యకలాపాలను నిలిపివేశారు. తాత్కాలికంగా ఎయిర్‌పోర్టును మూసివేశారు.
అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత విమానం ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు జనాలు. మామూలుగానే ఫ్లైట్ జర్నీ అంటే చాలా మందికి భయం. టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో కళ్లు మూసుకోవడం, గట్టిగా సీటును పట్టుకోవడం చేసే ప్రయాణికులు చాలామందే ఉంటారు. అలాంటిది.. ఇప్పుడు టేకాఫ్ అవుతుండగా బోయింగ్ విమానం కుప్పకూలడంతో ఇకపై ఫ్లైట్ జర్నీ అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించే కేటగగిరి పెరిగిపోవచ్చని అంటున్నారు. ఇప్పటి నుంచి ఏ చిన్న ఘటన జరిగినా.. విమాన ప్రమాదం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో బ్రేకింగ్ న్యూస్ తప్పకపోవచ్చు. ఈ బెదురు పోవాలంటే ఇంకెంత కాలం పడుతుందో.