భారత్ పై సుంకాలను భారీగా పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన వాదనని సమర్థించుకునేందుకు ఓ వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. రష్యా-ఇండియా మధ్య చమురు కొనుగోళ్ల ఒప్పందాన్ని ఆయన తప్పుబట్టారు. ఇండియాకు చమురుని అమ్మిన రష్యా, ఆ వచ్చిన డబ్బుతో ఉక్రెయిన్ పై దాడులు చేస్తోందట. అలా పరోక్షంగా ఉక్రెయిన్ పై జరిగిన దాడులకు ఇండియా కారణం అవుతోందని విమర్శించారు ట్రంప్. ఉక్రెయిన్ లో ఎంతమంది చనిపోతున్నా భారత్ కి పట్టింపు లేదన్నారు. అందుకే సుంకాలు పెంచుతున్నానని సెలవిచ్చారు. అయితే ట్రంప్ చర్యల్ని భారత ఆర్మీ సునిశితంగా ఖండించింది. ఆగస్ట్-5 ప్రాముఖ్యతను కూడా గుర్తు చేస్తూ 1971లో ప్రచురితమైన ఓ పేపర్ క్లిప్పింగ్ ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘దిస్ డే దట్ ఇయర్’ అంటూ 1971లో ఆగస్ట్-5న ఏం జరిగిందో గుర్తు చేసింది.
#IndianArmy#EasternCommand#VijayVarsh #LiberationOfBangladesh #MediaHighlights
"This Day That Year" Build Up of War – 05 Aug 1971 #KnowFacts.
"𝑼.𝑺 𝑨𝑹𝑴𝑺 𝑾𝑶𝑹𝑻𝑯 $2 𝑩𝑰𝑳𝑳𝑰𝑶𝑵 𝑺𝑯𝑰𝑷𝑷𝑬𝑫 𝑻𝑶 𝑷𝑨𝑲𝑰𝑺𝑻𝑨𝑵 𝑺𝑰𝑵𝑪𝑬 '54"@adgpi@SpokespersonMoD… pic.twitter.com/wO9jiLlLQf
— EasternCommand_IA (@easterncomd) August 5, 2025
అప్పుడేం జరిగింది?
1971లో రాజ్యసభలో నాటి రక్షణ మంత్రి వీసీ శుక్లా ప్రసంగాన్ని ప్రచురించిన పేపర్ క్లిప్పింగ్ అది. అప్పట్లో రష్యా, చైనా వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. రష్యా, చైనా తగ్గింపు ధరలకు చైనాకు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. రష్యా, ఫ్రాన్స్ మాత్రం పాకిస్తాన్ చేతికి ఆయుధాలు చిక్కనివ్వలేదని, కానీ అమెరికా, చైనా.. దానికి విరుద్ధంగా ప్రవర్తించాయని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో జరుగుతున్న మారణ హోమానికి పరోక్షంగా భారత్ కారణం అంటున్న అమెరికా.. అప్పుడు పాకిస్తాన్ కి నేరుగా ఆయుధాలు సరఫరా చేసి యుద్ధోన్మాదాన్ని ఎందుకు ప్రోత్సహించిందని భారత సైన్యం పరోక్షంగా ప్రశ్నించింది.
రెండు నాల్కలు..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు నాల్కల ధోరణిని భారత ప్రభుత్వం కూడా గట్టిగా తిప్పికొడుతోంది. సుంకాల విషయంలో అమెరికా ఏకపక్ష ధోరణిని ఇండియా ఖండించింది. అసలు ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ ని అమెరికా సహా అనేక ఇతర దేశాలు ప్రోత్సహించిన విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది. అమెరికాలోని అణు విద్యుత్ కేంద్రాలకోసం ఇప్పటికీ రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్‌ను దిగుమతి చేసుకుంటున్నారని, ఇదెక్కడి న్యాయం అని భారత్ ప్రశ్నిస్తోంది. రష్యాతో అమెరికా ఒప్పందాలు కరెక్ట్, అదే రష్యాతో భారత్ వాణిజ్య ఒప్పందాలు మాత్రం యుద్ధానికి కారణం అనడం సరికాదని చెబుతున్నారు భారత దౌత్యవేత్తలు.
పాక్ తో చెలిమి..
రష్యా పేరు చెప్పి ఓవైపు భారత్ పై సుంకాల మోత మోగించిన ట్రంప్, అటు పాకిస్తాన్ కి మాత్రం స్నేహ హస్తం అందించడం విశేషం. పాకిస్తాన్ పై ఇప్పటి వరకు ఉన్న సుంకాలను 29 శాతం నుంచి 19 శాతానికి తగ్గించి వేశారు ట్రంప్. అంతే కాదు, పాకిస్తాన్ లో చమురు వెలికితీతకు సాయం చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. అదే సమయంలో ట్రంప్, బలూచిస్తాన్ తో వైరం పెంచుకున్నారు. అసలు చమురు నిక్షేపాలు పాకిస్తాన్ లో లేవని, ఆ ప్రాంతం బలూచిస్తాన్ పరిధిలోకి వస్తుందని అక్కడి నేతలు పేర్కొంటున్నారు. పాక్ అమెరికా తో అంటకాగడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు.