Bhagyashri Borse: ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా వస్తారు.. ఎలా ఎదుగుతారు.. ఎప్పుడు పక్కకు తప్పుకుంటారు అనేది చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే.. ఎన్ని సినిమాలు చేస్తారు అనేది కూడా తెలియదు. అలా ఎంతోమంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు.. ఎప్పుడు వెళ్లారు అనేది కూడా చెప్పలేం. ఇక ఈ మధ్యకాలంలో మొదటి సినిమాతోనే స్టార్స్ గా పేరు తెచ్చుకున్నవారు కూడా ఎక్కువ కాలం ఆ స్టార్ డమ్ లో ఉండలేకపోతున్నారు.
అన్షు దగ్గరనుంచి శ్రీలీల వరకు మొదటి సినిమాతోనే మంచి విజయాలను అందుకొని తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్.. ఇప్పుడు అలాంటి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి హీరోయిన్స్ లో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. మిస్టర్ బచ్చన్ సినిమాతో ఈ చిన్నది తెలుగుతెరకు పరిచయమైంది. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమ గతేడాది రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. పరాజయాన్ని అందుకుంటే మాత్రం ఏమైంది.. ? భాగ్యశ్రీ అందానికి మాత్రం నూటికి నూరు శాతం మార్కులు పడ్డాయి.
మొదటి సినిమాతోనే అమ్మడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. అమ్మడి అందానికి ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. మొదటి సినిమా రిలీజ్ కాకముందే అమ్మడి చేతిలో అరడజను సినిమాలు వచ్చి చేరాయి. ఇక మిస్టర్ బచ్చన్ తరువాత భాగ్యశ్రీ నటించిన చిత్రం కింగ్డమ్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో అమ్మడి పాత్రను చూసి రిలీజ్ కు చిన్నదాని పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందేమో అని అనుకున్నారు. కానీ, సినిమా చూసాక మాత్రం అసలు ఏమి లేకపోవడంతో షాక్ అయ్యారు.
మిస్టర్ బచ్చన్ తరువాత వచ్చిన కింగ్డమ్ కూడా భారీ పరాజయాన్ని అందుకుంది. అయినా సరే భాగ్యశ్రీ వరుస అవకాశాలతో ముందుకు దూసుకుపోతుంది. ప్రస్తుతం భాగ్యశ్రీ ఆశలన్నీ రామ్ పోతినేనిపైనే పెట్టుకుంది. ప్రస్తుతం రామ్ నటిస్తున్న చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో అమ్మడి పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండబోతుందని తెలుస్తోంది. అందుకే భాగ్యశ్రీ ఈ సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకుందని సమాచారం.
ఇక ఈ సినిమా కాకుండా అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ సినిమాలో భాగ్యశ్రీ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాలోకి భాగ్యశ్రీని అధికారికంగా ఆహ్వానించనున్నారని సమాచారం. మరి ఇందులోఎంతవరకు నిజముందో అనేది తెలియాల్సి ఉంది. మరి రామ్ అయినా భాగ్యశ్రీ ఆశలను నెరవేరుస్తాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.