Nimisha Priya: వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో కేరళ నర్సు నిమిష ప్రియకు జులై 16న మరణ శిక్ష అమలు చేయనుంది యెమెన్ ప్రభుత్వం. ఉరి శిక్ష విషయాన్ని జైలులో ఉన్న ఆమెకు ఇప్పటికే అధికారులు తెలిపారు. మరోవైపు ప్రియను కాపాడేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. నిమిషకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిష ప్రియ యెమెన్ వెళ్లింది. అక్కడ వివిధ ఆసుపత్రుల్లో పని చేసింది. 2015లో సొంతంగా ఓ క్లినిక్ ఓపెన్ చేసింది. క్లినిక్ ఓపెన్ వెనుక కీలక భాగస్వామి తలాల్ అబ్దో మెహదీ. అతడు నిధులను దుర్వినియోగం చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో నిమిష-తలాల్ మధ్య వివాదాలు తలెత్తాయి.
ఇదే సమయంలో నిమిష ప్రియ పాస్‌పోర్టును ఇవ్వకుండా దాచిపెట్టాడు. దాన్ని పొందేందుకు అతడికి మత్తుమందు ఇచ్చినట్టు విచారణలో తేలింది. మత్తు మందు మోతాదు అధికం కావడంతో 2017లో తలాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత నిమిష తన సహోద్యోగి హనన్ సాయంతో మృతదేహాన్ని ముక్కలుగా చేసి నీటి ట్యాంకులో పడేసినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు.
2018 జూన్‌లో స్థానిక కోర్టు ఆమెని దోషిగా నిర్ధారించింది. ఆ తర్వాత 2020లో మరణశిక్ష విధించింది. 38 ఏళ్ల నిమిష ప్రియ యెమెన్ రాజధాని సనా జైలులో ఉన్నారు. జులై 16న ఉరిశిక్ష అమలు చేస్తున్నట్లు నిమిషప్రియకు అధికారులు తెలిపారు. అలాగే కేరళలోని ఆమె కుటుంబసభ్యులకు జైలు అధికారులు తెలియజేశారు.
ALSO READ: పాక్‌కు సాయం.. ఆపరేషన్ సింధూర్ పై స్పందించిన చైనా
ఈ విషయం తెలియగానే ప్రియను కాపాడేందుకు భారత్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా ఉరి శిక్ష ఆపేందుకు యెమెన్ అధికారులతో నిమిష ప్రియ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నా రు. ప్రస్తుతం ప్రియ తల్లిదండ్రులు బాధితుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోంది. ఒకవేళ తలాల్ ఫ్యామిలీ క్షమించినట్లయితే ప్రియ ఉరి శిక్ష నుంచి బయటపడే అవకాశముంది.
నష్టపరిహారంగా ఆ ఫ్యామిలీకి ఒక మిలియన్ అమెరికా డాలర్లు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్షమించే ప్రతిపాదనను అంగీకరించలేదని మానవ హక్కుల కార్యకర్త శామ్యూల్ జెరోమ్ తెలిపారు. చట్టపరమైన ఆప్షన్లు అయిపోయాయని, కేవలం కుటుంబం నుండి క్షమాపణ మాత్రమే మిగిలి ఉందన్నారు. వారం రోజులు ఉండడంతో తీవ్రప్రయత్నాలు చేస్తోంది ప్రియ ఫ్యామిలీ.