Renu Desai: సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలు సరదాగా మాట్లాడిన వాటిని సీరియస్ చేసి ట్రోల్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. అందుకే ఈమధ్య సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కానీ, ఇంటర్వ్యూస్ లో గాని ఆచితూచి మాట్లాడుతున్నారు. అయినా అందులో కూడా తప్పులు వెతికి మరి ట్రోల్ చేస్తున్నారు. తాజాగా నటి రేణు దేశాయ్ విషయంలో కూడా ఇదే జరిగింది. రేణు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఆమె కంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిత్యం ఏదో ఒక విషయమై ఆమె సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటుంది.
పవన్ తో విడాకుల తర్వాత ఇద్దరు పిల్లలతో ఆమె ఒంటరిగా నివసిస్తుంది. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన రేణు ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అవుతుంది అని అనుకున్నారు. కానీ రేణు మాత్రం సినిమాల విషయంలో కూడా ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని బయటపెట్టింది. సినిమాల గురించి, తన తదుపరి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగానే ఆమె భవిష్యత్తులో సన్యాసం తీసుకోనున్నట్లు తెలిపింది.
ఇక ఈ మాటను మీడియా వేరే విధంగా తీసుకొని రేణు దేశాయ్ సన్యాసం తీసుకుంటుందంటూ వార్తలు ప్రచురించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి రేణు వరకు చేరింది దీంతో ఆమె ఈ వార్తలను ఖండిస్తూ ఒక వీడియో చేసింది.” ఇలాంటి ఒక వీడియోను నేనెప్పుడూ చేస్తాను అని అనుకోలేదు. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో నేను సన్యాసం తీసుకుంటాను అని చెప్పిన మాటలను సీరియస్ గా తీసుకున్నారు. అది నేను సరదాగా చెప్పిన మాటలు యాంకర్ నన్ను హీరోయిన్ గా చేశారు.. ఎన్నో చూశారు.. ఇప్పుడు మళ్లీ నటిస్తున్నారు. ఆ తర్వాత ఏంటి..? అన్న ప్రశ్నకు నేను.. అన్ని అయిపోయాయి కాబట్టి ఇక సన్యాసమే అన్నట్లు చెప్పాను. అంతేగాని ఇప్పటికిప్పుడే సన్యాసం తీసుకుంటాను అని కాదు.
నా వయసు ఇంకా 45 మాత్రమే. నా పిల్లలు ఇంకా చిన్నవారే వారిని వదిలేసి సన్యాసం తీసుకునేంత బాధ్యత లేని తల్లిని కాదు. సన్యాసం కచ్చితంగా తీసుకుంటాను. కానీ, ఇప్పుడు కాదు నేను ముసలి దాన్ని అయ్యాక 65 వయసులో తీసుకుంటాను. నాకు ఆధ్యాత్మిక భావనలు ఉన్నాయి. కానీ, నా పిల్లల తర్వాతే దేవుడు అని నేను నమ్ముతాను. దయచేసి ఇలాంటి వార్తలను సృష్టించకండి. ఈ వార్త కన్నా సమాజంలో చాలా విషయాలు ఉన్నాయి. వాటి మీద ఫోకస్ చేయండి” అంటూ మీడియాకు చురకలు అంటించింది. ప్రస్తుతం రేణు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం రేణు ఒక అత్త కోడళ్ళ సినిమాలో అత్తగా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన మిగతా విషయాలు త్వరలోనే రివిల్ చేయనున్నట్లు ఆమె తెలిపింది. మరి ఈ సినిమాతో రేణు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.