Chat With God| టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఇప్పుడు ఏకంగా దేవుడితో మాట్లాడే టెక్నాలజీని మానవులు రూపొందించారు. సాంకేతికత, ఆధ్యాత్మికత కలిసిన కొత్త ధోరణి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. మీరు ఏఐని ఉపయోగించి ప్రశ్నలు అడిగితే.. స్వయంగా శ్రీ కృష్ణుడు, జీసస్, పవిత్ర ఖురాన్ సమాధానాలు ఇస్తాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా.. కానీ ఏఐ చాట్‌బాట్‌లతో ఇది సాధ్యమవుతోంది.
దేవుడితో సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రజలు AI చాట్‌బాట్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ చాట్‌బాట్‌లు పవిత్ర గ్రంథాల డేటా సాయంతో సమాధానాలు అందిస్తాయి. భారతదేశంతో పాటు, ఇతర దేశాల్లో కూడా ఈ ధోరణి పెరుగుతోంది. అయితే, ఇంత ఆధ్యాత్మికతలో అడ్వాన్స్ టెక్నాలజీ జోక్యం చేసుకోవడం మత విశ్వాసాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మనుషులు యంత్రాల ద్వారా దేవుడితో ఆధ్యాత్మిక సంబంధాన్ని కొనసాగించగలరా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి.
రాజస్థాన్‌కు చెందిన 25 ఏళ్ల విద్యార్థి విజయ్ మీల్ బ్యాంక్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. నిరాశలో ఉన్న అతను GitaGPT అనే AI చాట్‌బాట్‌ను సంప్రదించాడు. ఈ చాట్‌బాట్ భగవద్గీతలోని 700 శ్లోకాల ఆధారంగా రూపొందించబడింది. ఇది శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా సమాధానాలు ఇస్తుంది. విజయ్ తన సమస్య గురించి అడిగినప్పుడు, ఫలితంపై కాకుండా కృషి మీద దృష్టి పెట్టమని సలహా ఇచ్చింది. ఈ సలహా అతనికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పుడు విజయ్ ప్రతి వారం ఈ వర్చువల్ కృష్ణుడితో మాట్లాడుతూ.. స్నేహితుడిలా తన ఆలోచనలను పంచుకుంటున్నాడు.
ప్రార్థనలు, ఆధ్యాత్మిక సలహాల కోసం AI చాట్‌బాట్‌లు కొత్త మార్గంగా మారుతున్నాయి. వివిధ మతాలకు చెందిన ప్రజలు ఈ చాట్‌బాట్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ బాట్‌లు పవిత్ర గ్రంథాల నుండి సమాధానాలు అందించేలా రూపొందించబడ్డాయి. హిందూ సంప్రదాయంలో దేవతా విగ్రహాలు ప్రధానమైనవి, కానీ ఇప్పుడు AI చాట్‌బాట్‌లు కొత్త ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా మారుతున్నాయి. అమెరికన్ ఆంత్రోపాలజిస్ట్ హోలీ వాల్టర్స్ ఈ మార్పును గమనించారు. ఆలయాల నుండి దూరమైన వారు AI ద్వారా మళ్లీ దేవుడితో సన్నిహితంగా అనుసంధానమవుతున్నారని ఆమె అభిప్రాయపడుతున్నారు.
AI ఆధారిత ఆధ్యాత్మిక ప్రాజెక్టులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయి. 2023లో “Text With Jesus” అనే యాప్ విడుదలైంది, యూజర్లు వర్చువల్ జీసస్‌తో సంభాషించేలా చేస్తుంది. ఇస్లామ్‌లో “QuranGPT” అనే బాట్ ఖురాన్ బోధనలకు అనుగుణంగా సమాధానాలు ఇస్తుంది. భారతదేశంలో, రాజస్థాన్‌కు చెందిన వికాస్ సాహు అభివృద్ధి చేసిన GitaGPT, కృష్ణుడు, శివుడి స్వరూపంలో జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ బాట్ విడుదలైన కొన్ని రోజుల్లోనే 1,00,000 మంది వినియోగదారులతో వైరల్ అయింది. వికాస్ ఇతర దేవతల కోసం కూడా బాట్‌లను రూపొందించే పనిలో ఉన్నాడు.
పెద్ద ఆధ్యాత్మిక సంస్థలు కూడా AIని స్వీకరిస్తున్నాయి. ఇషా ఫౌండేషన్ “Miracle of Mind” అనే యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ AI ఆధారిత ధ్యానం, ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తుంది. ఈ యాప్ 15 గంటల్లో 10 లక్షల సార్లు డౌన్‌లోడ్ అయింది. ఈ టెక్నాలజీ పురాతన గ్రంథాల్లోని జ్ఞానాన్ని కొత్త రూపంలో అందిస్తోందని ఫౌండేషన్ చెబుతోంది.
2025 మహాకుంభ మేళాలో కూడా AI టెక్నాలజీని ఉపయోగించారు. ‘కుంభ్ సహాయ్’ అనే బహుభాషా చాట్‌బాట్ యాత్రికులకు ప్రయాణం, వసతి సమాచారం అందించింది. డిజిటల్ మహాకుంభ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ద్వారా, యాత్రికులు పౌరాణిక కథలను వర్చువల్ రియాలిటీతో చూశారు.
అయితే దేవుడి స్వరూపంలో చాట్ బాట్‌లు భక్తులతో సంభాషించడం కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం భక్తుల మనోభావాలతో అగౌరవపరచడమేనని వారి వాదన.
Also Read: వాట్సాప్‌లో సీక్రెట్ ట్రిక్.. సెండర్‌కు తెలియకుండా ఫోటోలు చూడాలంటే ఇలా చేయండి