వలస వచ్చినవారి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరీ దారుణంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అక్రమ వలసలను అరికట్టేందుకంటూ కొత్త నిబంధనలు తీసుకొచ్చిన ట్రంప్.. వీసాల విషయంలో లొసుగులు ఉంటే వారిని నిర్దాక్షిణ్యంగా అమెరికా నుంచి తిప్పిపంపించేస్తున్నారు. అయితే ఇలా పంపించే క్రమంలో వారిని నేరస్తులుగా చిత్రీకరిస్తూ, చేతులకు సంకెళ్లు వేసి అవమానకరంగా విమానాలు ఎక్కిస్తున్నారు. గతంలో కొంతమంది భారతీయులు కూడా ఇలాగే తిరిగి వచ్చేశారు. అప్పట్లో వారిని పంపించిన తీరు సరికాదంటూ భారత ప్రభుత్వం కూడా తమ నిరసన తెలిపింది. కానీ ప్రయోజనం లేదు. ఇప్పుడు ఇలాంటి ఘటనే న్యూజెర్సీలోని నెవార్క్ విమానాశ్రయంలో జరిగింది. అక్కడ ఓ భారతీయ విద్యార్థిని పెడరెక్కలు విరిచి కట్టి పోలీసులు విమానాశ్రయంలో బంధించారు. విమానం ఎక్కేందుకు వచ్చిన అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైరల్ వీడియో..
కునాల్ జైన్ అనే వ్యక్తి ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి భారతీయుడు అనే విషయం మాత్రమే తెలిసింది. అతను హర్యానా యాసలో మాట్లాడుతున్నాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అంతకు మించి వివరాలేవీ తెలియడంలేదు. అతడిని ఎందుకు అరెస్ట్ చేశారు..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? విడిచి పెట్టారా.. లేదా..? అనే వివరాలు తెలియడం లేదు. అయితే ఈ వీడియోపై చాలామంది తీవ్రంగా స్పందిస్తున్నారు. అమెరికా పోలీసుల తీరుని ఖండిస్తున్నారు. అదే సమయంలో అసలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని కొందరు నిలదీస్తున్నారు. అతడు ఏమైనా తప్పు చేశాడా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఎలాంటి తప్పు చేయకుండానే పోలీసులు అరెస్ట్ చేస్తే, ఎన్నారైలు మద్దతుగా నిలవాలి కదా అని కామెంట్లు పెడుతున్నారు.
I witnessed a young Indian student being deported from Newark Airport last night— handcuffed, crying, treated like a criminal. He came chasing dreams, not causing harm. As an NRI, I felt helpless and heartbroken. This is a human tragedy. @IndianEmbassyUS #immigrationraids pic.twitter.com/0cINhd0xU1
— Kunal Jain (@SONOFINDIA) June 8, 2025
నిస్సహాయుడిని..
అమెరికాలో భారతీయ యువకుడి చేతికి సంకెళ్లు వేసి, బంధించిన వీడియో సంచలనంగా మారడంతో ప్రభుత్వం కూడా దీనిపై ఆరా తీస్తోంది. విదేశాల్లోని భారతీయ విద్యార్థుల పట్ల పోలీసులు ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా అంటూ నెటజన్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే భారత ప్రభుత్వం, అధికారులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. జూన్-7న ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. సదరు భారతీయ యువకుడి వీడియోని పోస్ట్ చేసిన కునాల్ జైన్ ఆ దృశ్యాన్ని హృద్యంగా వర్ణించాడు. అందరిలాగే కలలు నెరవేర్చుకోడానికి అతడు అమెరికాకు వచ్చాడు కానీ, ఇలా నేరస్థుడిలా అతడిని బంధించడం చూస్తుంటే బాధకలుగుతోందన్నాడు. సాటి భారతీయుడిగా తాను ఆ పరిస్థితుల్లే ఏమీ చేయలేకపోయానని, నిస్సహాయుడిగా మిగిలిపోయానని చెప్పాడు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకోవాలని కోరాడు కునాల్ జైన్. ఆ విద్యార్థికి సహాయం కోరుతూ భారత రాయబార కార్యాలయం, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కూడా తన ట్వీట్ లో ట్యాగ్ చేశాడు.
హెచ్చరిక..!
పోలీసుల అదుపులో ఉన్న భారతీయ యువకుడు తప్పుడు ధృవీకరణ పత్రాలతో వచ్చాడా, లేక పత్రాలన్నీ సరిగానే ఉన్నా పోలీసులకు సరైన సమాచారం అందివ్వలేకపోయాడా అనేది తేలాల్సి ఉంది. అయితే అక్రమంగా అమెరికాలో ఉంటున్న చాలామంది విదేశీయులకు ఇది మరో హెచ్చరిక అనుకోవాల్సిందే. ఇప్పటికే వలసదారుల ఏరివేత మొదలవడంతో లాస్ ఏంజిలస్ తగలబడిపోతోంది. వలసదారులపై పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అన్ని పత్రాలు ఉన్నా కూడా ఏదో ఒక తప్పులు వెదుకుతున్నారు. ఇక తప్పుడు పత్రాలతో అమెరికా వస్తే తిప్పలు తప్పవు అనేది మాత్రం వాస్తవం.