
Foreign Citizenship : విదేశాలకు వలస వెళుతున్న భారతీయుల(Indian) సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. వీరిలో ఎక్కువ శాతం మంది సంపన్న దేశాల పౌరసత్వం(citizenship) పొందడానికి పరుగులు తీస్తున్నారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆయా దేశాలలో మెరుగైన ఉపాధి అవకాశాలు, ఆర్థిక పరిస్థితులు, శాంతి భద్రతలు, సామాజిక, రాజకీయ స్థిరత ఉండడంతో భారతీయులు అక్కడి పౌరసత్వం తీసుకుంటున్నారు.
భారతీయులు ఎక్కువగా ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళుతున్నప్పటికీ.. కొందరు మాత్రం సంపన్న దేశాల పాస్‌పోర్టు తీసుకుంటే.. ప్రపంచంలో చాలా దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చుననే కారణం చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా, కెనడా లాంటి దేశాల పాస్‌పోర్టు ఉంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు వీసా లేకుండా సులభంగా ప్రయాణించవచ్చు. అలాగే అక్కడి ప్రభుత్వాలు పౌరసత్వం తీసుకుంటున్న భారతీయులకు కీలక శాఖలలో ఉద్యోగాలను అందిస్తున్నాయి.
ప్రస్తుతం కెనడా, భారతదేశాల మధ్య రాజకీయ విభేదాలున్నప్పటికీ.. కెనెడా పౌరసత్వం తీసుకుంటున్న విదేశీయుల జాబితాలో భారతీయలే అధికంగా ఉన్నారని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కొఆపరేషన్ ఎండ్ డెవలప్మెంట్ (OECD) చెబుతోంది. అలాగే భారతీయులు మిగతా దేశాలకంటే అమెరికా పౌరసత్వంపై మక్కువ చూపిస్తున్నారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా కెనెడా ప్రభుత్వం విదేశీ నాగరికులకు చాలా వేగంగా పౌరసత్వం అందిస్తోంది. అలాగే 2023 సంవత్సరానికిగాను సంపన్న దేశాల పౌరసత్వం పొందిన వారిలో భారతీయులు ముందంజలో ఉన్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే దాదాపు 28 లక్షల మంది విదేశీయులు సంపన్న దేశాల పౌరసత్వం తీసుకున్నారని సమాచారం.
అగ్రస్థానంలో అమెరికా
OECD రిపోర్టు ప్రకారం.. 2021 సంవత్సరంలో 1.3 లక్షల మంది భారతీయులు సంపన్న దేశాల పౌరసత్వం పొందారు. విదేశీయులకు పౌరసత్వం ఇవ్వడంలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. దాదాపు 56,000 మంది భారతీయులు అమెరికా పాస్‌పోర్టు తీసుకున్నారు. ఆ తరువాతి స్థానాలలో ఆస్ట్రాలియా(24,000), కెనడా (21,000) దేశాలు ఉన్నాయి.