
Babar Azam : పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కెప్టెన్సీ పోయినట్టేనని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు తగినట్టుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఆలోచనలు చేస్తున్నట్టు గా తెలిసింది. ప్రత్యామ్నాయంగా ఎవరున్నారని లెక్కలు కూడా తీస్తున్నారని తెలిసింది. ఒకవేళ బాబర్ కెప్టెన్సీ పోతే, పాక్ కోచ్ టీమ్ ని కూడా సాగనంపుతారని అంటున్నారు. వరల్డ్ కప్ అనంతరం పాక్ కెప్టెన్సీ మార్పు జరగడం తథ్యం అంటున్నారు.
ప్రపంచ క్రికెట్ ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్ విభాగంలో బాబర్ అజామ్ నెంబర్ 1 గా చాలాకాలం నుంచి ఉన్నాడనే సంగతి తెలిసిందే. అందువల్ల అందరూ అనేమాట ఏమిటంటే.. పాకిస్తాన్ జట్టు ఓడిపోతూ ఉండవచ్చు గానీ, బాబర్ అజమ్ ఓడిపోలేదని అంటున్నారు. ఆఫ్గాన్ మ్యాచ్ లో 74 పరుగులు చేశాడని కూడా చెబుతున్నారు.
అంతేకాదు ఇండియాపై ఓడిపోయినప్పుడు మన విరాట్ కొహ్లీ దగ్గరకు వచ్చి తన జెర్సీ అడిగితీసుకోవడంతో..అతని స్ఫూర్తిదాయక తీరుకి బాబర్ పై భారత్ లో కూడా అభిమానులు పెరిగారు. అంతేకాదు తను కూల్ గా ఆడేతీరు అందరికీ నచ్చుతుందని అంటుంటారు.
ఒకవేళ బాబర్ ను మార్చితే పాకిస్తాన్ లో కెప్టెన్ అయ్యేవాళ్లు ఎంతమంది ఉన్నారని అంటే, మాజీ కెప్టెన్ సర్ఫరాజ్, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్, పేసర్ షహీన్ షా అఫ్రిదీలలో ఒకరికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. టీమ్ ఎంపికలో బాబర్ అజామ్ కి పూర్తి స్వేచ్చనిచ్చారని పీసీబీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ సెమీస్ చేరితే మాత్రం టెస్ట్ క్రికెట్ లో బాబర్ ని కొనసాగిస్తారని అంటున్నారు. అంటే కెప్టెన్ మార్పుపై ఒక నిర్ణయానికి వచ్చేసినట్టేనని భావిస్తున్నారు.
ఇంతవరకు బాబర్ అన్ని ఫార్మాట్లలో కలిపి 131 మ్యాచ్ లకు సారథ్యం వహించాడు. అందులో 61 మ్యాచ్ ల్లో పాకిస్తాన్ విజయం సాధించింది. విజయాల శాతం బాగానే ఉంది. మాజీ కెప్టెన్ సర్పరాజ్ కి బాబర్ కన్నా మెరుగ్గా ఉన్నాడు. అయితే వికెట్ కీపర్ రిజ్వాన్ మాత్రం రెండు మ్యాచ్ లకే సారథ్యం వహించాడు. రెండింటిలో పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఇక షహీన్ షా ఆఫ్రిది ఒక్క మ్యాచ్ కి కూడా సారథ్యం వహించలేదు. వీరి ముగ్గురిలో చూస్తే ఒకసారి సర్ఫరాజ్ ని బోర్డు వద్దని అనుకుంది కాబట్టి, మళ్లీ నువ్వే దిక్కు రా బాబూ, అని అంటారనే గ్యారంటీ లేదని చెబుతున్నారు.
రిజ్వాన్ కే సారథ్య బాధ్యతలు వచ్చే అవకాశాలున్నాయి. తను ఎన్నో సార్లు జట్టుని కీలక సమయాల్లో ఆదుకున్నాడు. నమ్మకమైన బ్యాట్స్ మెన్ గా ఉన్నాడు. అందుకని బాబర్ ని కాదని అనుకుంటే మాత్రం రిజ్వాన్ సరైనవాడని అంటున్నారు. వరల్డ్ కప్ తర్వాత పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అప్పటికి కొత్త కెప్టెన్ తో పాక్ జట్టు ఆస్ట్రేలియా బయలుదేరుతుందని అంటున్నారు.