International Women’s Day | జీవితంలో విజయం సాధించిన ప్రతి మనిషి వెనుక మహిళా శక్తి ఉంటుందని మన పెద్దలు చెప్పే మాట. ఆ మహిళ ఒక తల్లి కావొచ్చు, ఒక భార్య కావొచ్చు, ఒక సోదరి లేదా కూతురు కూడా కావొచ్చు. అలాంటి మహిళా శక్తికి గౌరవసూచకంగా ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే వేడుకనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) అని అంటారు.
ఈ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమ స్ఫూర్తితో మొదలైంది. దాదాపు వంద సంవత్సరాల క్రితం 1908లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 15 వేల మంది మహిళలు భారీ స్థాయిలో నిరసనలు చేశారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా మెరుగైన జీతం, తక్కువ పనిగంటల కోసం మహిళలు డిమాండ్ చేశారు. ఆ మహిళల నిరసనకు ఫలితంగా 1909లో అమెరికాలోని సోషలిస్టు పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.
1910లో క్లారా జెట్కిన్ అనే మహిళ కోపెన్ హేగెన్ లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్స్ సదస్సులో ప్రతిపాదన చేసింది. ఈ సదస్సులో పాల్గొన్న 17 దేశాల ప్రతినిధులు ఆ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. 1911లో యూరోపియన్ దేశాలలో కూడా దాదాపు పది లక్షల మంది మహిళా హక్కుల కోసం మహిళా దినోత్సవం ఉండాలని ముందుకొచ్చారు. అలా సంవత్సరాల పాటు మహిళా దినోత్సవాన్ని సమర్థించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. 1975 నుంచి ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం ప్రారంభించింది.
మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశం.. సమాజంలో లింగ వివక్ష, మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలను వ్యతిరేకించడం, మహిళా సాధికారత ప్రోత్సహించడం, మహిళా హక్కుల కోసం పోరాడడం. శతాబ్ద కాలంగా పోరాడుతున్నా సమాజంలో లింగ వివక్ష ఇంకా జరుగుతూనే ఉంది. ప్రపంచ ఆర్థిక ఫోరం అంచనా ప్రకారం… లింగ వివక్ష పూర్తిగా అరికట్టడానికి మరో వంద సంవత్సరాలు పడుతుంది.
ప్రతీ సంవత్సరం ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒక థీమ్ ప్రకారం నిర్వహిస్తుంది. 2024లో ‘మహిళల పెట్టుబడిని ప్రోత్సహించండి.. అభివృద్ధిని వేగవంతం చేయండి’ (‘Invest in Women: Accelerate Progress’) అనేది థీమ్. ఈ థీమ్ ద్వారా సమాజంలోని వివిధ వర్గాలలోని మహిళల ఆర్థికంగా బలోపేతం చేయలని ఐక్యరాజ్యసమితి భావిస్తోంది.
ఆందోళనకరంగా మహిళల ఆరోగ్యం
సర్వే ప్రకారం.. భారత దేశంలో మహిళలు ఎక్కువగా రోగాల బారిన పడుతున్నారు. భారతీయ మహిళల్లో ఎక్కువగా కనిపించే వ్యాధులు ఇవే.
1.గుండె సంబంధిత వ్యాధులు
2. రక్త హీనత
3. ఎముకల వ్యాధులు
4. మూత్రాశయ సంబంధిత సమస్యలు
5. బ్రెస్ట్, సర్వికల్ క్యాన్సర్
సక్రమంగా లేని జీవనశైలీ, పౌష్టికాహార లోపమే దీనికి ప్రధాన కారణాలు. ముఖ్యంగా గ్రామాల్లో నివసించే మహిళలు ఈ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.