Hyderabad News: బంగారం కోసం మనుషులను చింపేసిన రోజులు వచ్చేశాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్‌లో జరిగింది. బంగారం, డబ్బు కోసం ఓ మహిళను దారుణంగా హత్య చేసి చంపేశారు దుండగులు. అక్కడి నుంచి బంగారు ఆభరణాలు పట్టుకుని పరారయ్యారు. అసలు ఘటన వెనుక ఏం జరిగింది?
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ మహిళ హత్యకు గురైంది. స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు మహిళ కాళ్లు కట్టేసి ఆమెని చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత కుక్కర్‌తో కొట్టారు. చివరకు గొంతు కోసి హత్య చేశారు. ఈ విధంగా చిత్రహింసలు పెట్టి చంపడానికి కారణమేంటి? మహిళకు ఎవరైనా ప్రత్యర్థులు ఉన్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
కూకట్‌పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో బుధవారం దారుణం జరిగింది. రాకేశ్-రేణు అగర్వాల్ దంపతులకు ఫతేనగర్‌లో స్టీలు షాపు ఉంది. వారి కూతురు తమన్నా వేరే రాష్ట్రాల్లో చదువుతోంది. కొడుకు శుభంతో కలిసి ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటున్నారు. స్వాన్ లేక్‌లో ఉంటున్న రేణు బంధువుల ఇంట్లో ఝార్ఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి దాదాపు పదేళ్లుగా పని చేస్తున్నాడు.
ఆ నమ్మకంతో అతడు జార్ఖండ్‌లో తన గ్రామానికి చెందిన హర్ష్‌ను వారం కిందట రేణు ఇంట్లో వంట మనిషిగా పెట్టాడు. వంట మనిషిగా ఉన్న యువకుడు మరొకరితో కలిసి రేణు అగర్వాల్ చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత చిత్రహింసలకు పాల్పడ్డారు. చివరకు తలపై కుక్కర్‌తో కొట్టారు.ఇంకా బతికి ఉంటుందని అనుమానంతో గొంతు కోసి చంపేశారు.
ALSO READ: పరోటా కోసం వెళ్లి ప్రాణాలే పొగొట్టుకున్నాడు, మేటరేంటి?
ఆ ఘటన తర్వాత ఇంట్లో ఉన్న నగదు, బంగారం దోచుకెళ్లారు. ఎక్కడ ఆనవాళ్లు దొరక్కకుండా ఉండేందుకు ఆ ఇంట్లో స్నానం చేసి యజమానికి చెందిన టూ వీలర్ పై అక్కడి నుంచి దుండగులు పరారయ్యారు. ఈ ఘటన ఎలా బయటపడింది అన్నదే అసలు పాయింట్.
ఎప్పటి మాదిరిగా బుధవారం ఉదయం ఇంటి యజమాని రాకేశ్, ఆయన కొడుకు శుభం షాపుకి వెళ్లారు. ఇంట్లో రేణు అగర్వాల్ ఒక్కరే ఉన్నారు. సాయంత్రం ఐదు గంటలకు భర్త, కొడుకు ఫోన్ చేసినా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రాత్రి 7 గంటల సమయంలో భర్త రాకేశ్ ఇంటికొచ్చాడు. తలుపు తట్టినా తీయకపోవడంతో ప్లంబర్‌ను పిలిపించి తలుపు తీయించాడు.
ఇంటి హాల్లో రేణు కాళ్లు, చేతులు కట్టేసి రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె శరీర భాగాలపై తీవ్ర గాయాలున్నాయి. వెంటనే రాకేష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో ఉన్న హర్ష్ తన ఫ్రెండ్ రోషన్‌తో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించారు. ఇంట్లోని లాకర్‌ని బద్దలు కొట్టి దొరికిన డబ్బు, బంగారు ఆభరణాలు తీసికెళ్లి నట్టు కనిపించింది.
నిందితులు ఖాళీ చేతులతో వచ్చి సూట్‌కేసుతో తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో కనిపిస్తోంది. ఘటన తర్వాత దుస్తులను ఇంట్లోనే వదిలేశారు. స్నానం చేసి వేరే దుస్తులు రాకేశ్ ఫ్యామిలీకి చెందిన టూ వీలర్‌పై పారిపోయారు. నిందితుల కోసం ఐదు బృందాలు రంగంలోకి దిగినట్టు పోలీసులు తెలిపారు.
రేణు అగర్వాల్ హత్య కేసు నిందితుల కోసం గాలిస్తున్నట్లు బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్ తెలిపారు. ఇంట్లో పని చేసే 20 ఏళ్ల హర్షపై అనుమానం ఉందన్నారు. గతంలో ఏమైనా నేరారోపణలు ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
కాళ్లు కట్టేసి, గొంతు కోసి.. కూకట్ పల్లిలో మహిళ దారుణ హత్య
స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో ఘటన
పని మనుషులే దోపిడీ చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు
ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
మృతురాలు రేణు అగర్వాల్ గా గుర్తింపు pic.twitter.com/3TJ98sGegI
— BIG TV Breaking News (@bigtvtelugu) September 10, 2025