Blue Light: స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టాబ్లెట్లతో పాటు ఎల్‌ఈడీ టీవీల వంటి డిజిటల్ పరికరాల నుంచి వెలువడే కాంతిలో నీలి కాంతి కూడా ఒక భాగం. ఇది కనిపించే కాంతి వర్ణపటంలో ఎక్కువ శక్తిని కలిగి ఉండే తరంగదైర్ష్యం కలిగి ఉంటుంది. పగటి పూట సూర్యకాంతిలో కూడా నీలి కాంతి ఉంటుంది. ఇది మన చురుకుదనాన్ని ఏకాగ్రతను పెంచుతుంది. అయితే డిజిటల్ స్క్రీన్‌ల ద్వారా ఈ కాంతికి గురి కావడం వల్ల మన కళ్లు, మొత్తం ఆరోగ్యంపై కొన్ని ముఖ్యమైన ప్రభావాలు పడతాయని నిపుణులు చెబుతున్నారు.
బ్లూ లైట్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్:
1. కంటి ఒత్తిడి, అలసట:
నీలి కాంతికి ఎక్కువ సేపు గురికావడం వల్ల కంటి కండరాలు త్వరగా అలపిపోతాయి. ఎందుకంటే ఈ తరంగదైర్ఘ్యం కాంతిని దృష్టి కేంద్రీకరించడానికి కళ్ళు మరింత ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది.
లక్షణాలు: దృష్టి మసకబారడం, కళ్లలో మంట, తలనొప్పి, కళ్లు పొడిబారడం, దృష్టిని కేంద్రీకరించడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో కూడిన కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
2. నిద్రపై ప్రతికూల ప్రభావం:
ఇది నీలి కాంతి కళ్లపై చూపే అత్యంత ముఖ్యమైన ప్రభావాలలో ఒకటి. మానవ శరీరంలో నిద్ర-మేల్కొలుపు చక్రాన్ని నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని నీలి కాంతి అడ్డుకుంటుంది.
ప్రభావం: రాత్రిపూట.. ముఖ్యంగా పడుకోవడానికి ముందు డిజిటల్ స్క్రీన్లను చూడటం వల్ల మెదడు పగలు ఉందని భ్రమించి మెలటోనిన్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది. దీని ఫలితంగా నిద్ర ఆలస్యం కావడం.. నిద్ర నాణ్యత తగ్గడం అంతే కాకుండా నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి.
3. రెటీనా దెబ్బతినే ప్రమాదం:
నీలి కాంతి అధిక శక్తిని కలిగి ఉంటుంది. ఇది కంటిలోని కార్నియా, లెన్స్ ద్వారా నేరుగా లోపలికి ప్రవేశించి, రెటీనా వరకు చేరుకోగలదు. దీర్ఘకాలికంగా బ్లూ లైట్‌కు గురికావడం వల్ల రెటీనాలోని కణాలకు హాని కలిగే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ప్రమాదం: ఈ నష్టం కాలక్రమేణా వయస్సు సంబంధిత మస్కులర్ డీజనరేషన్ వంటి తీవ్రమైన దృష్టి సమస్యలకు దారితీయవచ్చు. అయితే.. డిజిటల్ పరికరాల నుంచి వచ్చే కాంతి ఈ స్థాయి ప్రమాదాన్ని కలిగిస్తుందా అనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.
Also Read: వీళ్లు.. పొరపాటున కూడా పైనాపిల్ తినకూడదు !
పరిష్కారాలు, నివారణ మార్గాలు:
ఈ ప్రభావాలను తగ్గించడానికి కొన్ని పద్ధతులను అనుసరించవచ్చు.
20-20-20 నియమం: ప్రతి 20 నిమిషాలకు, స్క్రీన్ నుంచి 20 సెకన్ల విరామం తీసుకుని.. 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడాలి. ఇది కంటి కండరాలకు విశ్రాంతినిస్తుంది.
నైట్ మోడ్: రాత్రిపూట ఎలక్ట్రానిక్ పరికరాలలో.. నైట్ మోడ్ లేదా బ్లూ లైట్ ఫిల్టర్ సెట్టింగ్‌లను ఉపయోగించడం ద్వారా నీలి కాంతిని తగ్గించవచ్చు.
బ్లూ లైట్ ఫిల్టరింగ్ గ్లాసెస్: డిజిటల్ స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడిపే వారు నీలి కాంతిని అడ్డుకునే ప్రత్యేక అద్దాలను ధరించవచ్చు.
పడుకునే ముందు దూరం: నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చూడటం పూర్తిగా మానుకోవాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డిజిటల్ పరికరాల వాడకం వల్ల కలిగే కంటి ఒత్తిడిని, నిద్ర లేమి సమస్యలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.