Elon Musk On Australia: ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు సోషల్ మీడియా వినియోగం పెరిగిపోతున్నది. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు విపరీతంగా వాడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు గంటల తరబడి సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. సోషల్ మీడియాకు బానిసలుగా మారడంతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏండ్లలో లోపు పిల్లలు సోషల్ మీడియా చూడకుండా నిషేధించారు. ఈ మేరకు ఆస్ట్రేలియన్ పార్లమెంట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం టిక్ టాక్, ఫేస్ బుక్, స్నాప్ చాట్, ఎక్స్, ఇన్ స్టాగ్రామ్, రెడ్డిట్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్స్ లో పిల్లలకు అకౌంట్స్ ఉండకూడదని వెల్లడించింది. ప్రమాదకర కంటెంట్ చూడటం వల్ల పిల్లలు చెడుమార్గం పడుతున్న నేపథ్యంలో బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఆస్ట్రేలియా నిర్ణయంపై మస్క్ సంచలన వ్యాఖ్యలు
ఆస్త్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీసింది. ఈ నిర్ణయాన్ని చాలా మంది అభినందిస్తుంటే.. మరికొంత మంది తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆస్ట్రేలియా సర్కారు నిర్ణయంపై ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇంటర్నెట్ యాక్సెస్ ను నియంత్రించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం బ్యాక్ డోర్ రూట్ ను ఎంచుకుందని విమర్శించారు.
చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
తాజాగా ఈ చట్టం గురించి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ X వేదికగా 16 ఏండ్లలలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ ఉండకూడదనే చట్టాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. తమదేశ పిల్లల భద్రత, ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే, భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు. తాజాగా చట్టానికి ఆమోదం లభించిన నేపథ్యంలో మస్క్ ఆస్ట్రేలియాపై తీవ్ర విమర్శలు చేశారు.
గత కొంతకాలంగా ఆస్ట్రేలియా ప్రధాని, మస్క్ నడుమ వివాదం
కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియాలో బిషప్ మీద దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ కంటెంట్ ను X నుంచి తొలగించాలని ఆస్ట్రేలియన్ ఫెడరల్ కోర్టు ఆదేశించింది. అయితే, కేవలం ఆస్ట్రేలియాలో మాత్రమే ఈ కంటెంట్ కనిపించకుండా చేసిన X యాజమాన్యం, ఇతర దేశాల్లో ఆ కంటెంట్ ను తొలగించలేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియన్ ప్రధాని అల్బనీస్ X తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాకు సామాజిక బాధ్యత ఉండాలన్నారు. మస్క్ తన సోషల్ మీడియా వేదిక మీద హింసాత్మక కంటెంట్ ను ఉంచడానికి మద్దతు పలకడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఆయనో పొగరుబోతు బిలియనీర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని విమర్శించారు. ఈ విమర్శలపై స్పందించిన మస్క్, X అనేది నిజమైన వాక్ స్వాతంత్ర్యం ఉన్న వేదిక అని చెప్పుకొచ్చారు. ఈ వివాదం నేపథ్యంలో మస్క్ తాజాగా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి సోషల్ మీడియా మాయలో పడి ఎంతో మంది పిల్లలు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఆస్ట్రేలియ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని చాలా దేశాలు సమర్థిస్తున్నాయి. మస్క్ మామ కూడా పాజిటివ్ గా ఆలోచించడాల్సిన అవసరం ఉంది.
Read Also: స్టీమ్ రైల్లో వైఫై కోసం నేరుగా శాటిలైట్ తో లింక్, అధికారుల సరికొత్త ఆలోచన!