Steam Train: బ్రిటన్ లోని డోర్సెట్‌లోని ఐల్ ఆఫ్ పర్బెక్ లో నడిచే స్టీమ్ రైలుకు చారిత్ర నేపథ్యం ఉంది. ఎన్నో వందల సంవత్సరాలుగా ఈ రైలు బ్రిటన్ ప్రజలకు సేవలు అందిస్తున్నది. బ్రిటన్ ప్రభుత్వం ఈ రైలును వారసత్వ సంపదగా గుర్తించింది. తొమ్మిది మైళ్ల మేర ఈ రైలు ప్రయాణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే ఈ హెరిటేజ్ రైలుతో పాటు రైల్వే స్టేషన్ పరిధిలో పూర్తి స్థాయి వైఫై ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం నేరుగా ఉపగ్రహం నుంచి రైల్లో వైఫై సిస్టమ్ కు కనెక్ట్ చేస్తున్నారు అధికారులు.
క్యాష్ లెస్ సేవలకు ఇబ్బంది కలగడంతో కీలక నిర్ణయం
పురాతన రైల్వే స్టేషన్ కు బ్రిటన్ ప్రభుత్వం ఆధునిక హంగులను అద్దుతోంది. ఇందులో భాగంగానే క్యాష్ లెస్ సేవలకు శ్రీకారం చుట్టింది. నేరుగా డబ్బు తీసుకోకూడదని నిర్ణయించింది. పార్కింగ్ ఛార్జ్, టికెట్ కొనుగోళ్లు అన్నీ ఆన్ లైన్ ద్వారానే జరిగేలా చర్యలు తీసుకుంది. అయితే, ఈ రైల్వే స్టేషన్ లో ఇంటర్నెట్ సరిగా రాకపోవడంతో ప్రయాణీకలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది పార్కింగ్ దగ్గర, టికెట్ కొనుగోలు చేసే సమయంలో ఇంటర్నెట్ సరిగా రాక చెల్లింపులు చేయలేకపోయారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మోబైల్ సిగ్నల్స్, డేటా కవరేజీ సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు.
రైల్వే స్టేషన్ పరిసరాలతో పాటు రైల్లోనూ వైఫై సేవలు
ఈ నేపథ్యంలో చారిత్రక స్టీమ్ రైలు ప్రయాణంలో ప్రయాణీకులకు పూర్తి స్థాయిలో వైఫై సౌకర్యం అందించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్టేషన్ లో వైఫై సేవల కోసం డిపార్ట్ మెంట్ ఫర్ సైన్స్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ డోర్సెట్ కౌన్సిల్ ను ఆదేశించింది. అంతేకాదు, 163,000 పౌండ్ల( ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. కోటి 70 లక్షలు) బడ్జెట్ కేటాయించింది. రైల్వే స్టేషన్ అంతటినీ కవర్ చేయడంతో పాటు రైల్లోనూ వైఫై సేవలు అందించేందుకు నేరుగా ఉపగ్రహంతో నడిచే వైఫై ప్రోగ్రామ్ ను ప్రారంభించింది.
2025లో అందుటులోకి పూర్తిస్థాయి వైఫై సేవలు
స్టీమ్ రైల్వే స్టేషన్ లో వైవై ఏర్పాటుకు ఎక్సెలరేట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2025లో అందుబాటులోకి రానున్నాయి. కార్డిఫ్-ఆధారిత శాటిలైట్ సంస్థ అన్ని సర్వీస్ ప్రొవైడర్ల నుంచి మొబైల్ సిగ్నల్స్ ను సమీకరించి, వాటిని కలిసి బూస్ట్ చేస్తుంది. OneWeb ఉపగ్రహాలు అందించే అదనపు సామర్థ్యంతో పని చేస్తాయి. ఈ నేపథ్యంలో 200 Mpbs కంటే ఎక్కువ వేగంతో వైఫై సేవలను పొందే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వైఫై కవరేజీ కారు పార్కింగ్, టికెట్ కౌంటర్, ఫ్లాట్ ఫారమ్ చుట్టు పక్కల అందుబాటులో ఉంటుంది. రైలు ప్రయాణంలోనూ పూర్తి స్థాయిలో కవర్ చేస్తుందని తెలిపారు.
Read Also: రైల్వే ప్రయాణీకులకు సూపర్ న్యూస్, జనరల్ బోగీలు పెరుగుతున్నాయ్!