MRI స్కానింగ్. ఆధునిక వైద్యంలో దీని ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. సునిశితంగా సమస్యను విశ్లేషించి వైద్యం చేయాలంటే MRI స్కానింగ్ తప్పనిసరి. MRI స్కాన్ సెంటర్ ని చూసినవారెవరికైనా అక్కడి కండిషన్స్ చదివే ఉంటారు. MRI చేయించుకున్నవారికి కూడా ఇది అనుభవంలోని విషయమే. మెడలో చైన్లు ఏవీ ఉండకూడదు. కమ్మలు, ముక్కుపుడక లాంటివి కూడా తీసేయమంటారు. మగవాళ్లయితే మొలతాడు కూడా వద్దంటారు. కనీసం పిన్నీసులు కూడా దగ్గర ఉంచనీయరు. పూర్తిగా చెక్ చేసి మరీ స్కానింగ్ కి పంపిస్తుంటారు అక్కడి సిబ్బంది. ఒకవేళ అలాంటి వస్తువులు, అంటే లోహాలు మనిషితో పాటు ఉంటే ఏం జరుగుతుంది? పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు అరుదుగానే వెలుగులోకి వస్తుంటాయి. మెడలో ఓ లోహపు గొలుసు ధరించి స్కానింగ్ సెంటర్లో అడుగు పెట్టిన ఓ వ్యక్తిని మెషిన్ లాగేసుకుంది. దీంతో తీవ్ర గాయాలతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఎక్కడ జరిగింది..?
MRI మెషిన్ వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్ ఆస్పత్రిలో జరిగింది. అతడి వయసు 61 ఏళ్లు. మెడలో గొలుసు ధరించి స్కానింగ్ సెంటర్లో అడుగు పెట్టాడు. ఇంకేముంది. పెద్ద శబ్దంతో మిషన్ అతడిని లాగేసుకుంది. మిషన్లో పడిన అతడికి తీవ్ర గాయాలయ్యాయి. తిరిగి అదే ఆస్పత్రిలో అతడికి చికిత్స చేశారు. అయినా లాభం లేదు. అతను చనిపోయాడు. సదరు వ్యక్తి స్కానింగ్ కోసం వచ్చాడా, లేక రోగి సహాయకుడా అనేది మాత్రం తెలియరాలేదు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది ఆసక్తికర కామెంట్లు పెట్టారు. స్కానింగ్ సమయంలో గది తలుపులు క్లోజ్ చేస్తారు కదా, మరి అతడు ఎలా వచ్చాడు అని కొంతమంది ప్రశ్నించారు. ఆ వ్యక్తి చనిపోతే, అసలు స్కానింగ్ తీయించుకుంటున్న రోగి సంగతేంటని మరికొందరు ప్రశ్నించారు.
ఎందుకిలా..?
మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ ని MRI అంటారు. ఈ స్కానింగ్ యంత్రంలో అతి పెద్ద అయస్కాంతం ఉంటుంది. లోహాలను అది చాలా వేగంగా ఆకర్షిస్తుంది. అందుకే లోహపు వస్తువులకు లోపలికి అనుమతి ఉండదు. MRI స్కానింగ్ రూమ్ లో కి లోహపు వస్తువులు వెళ్తే ఏం జరుగుతుందనే విషయంపై చాలా వీడియోలు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటాయి. పొరపాటున కూడా ఆ గదిలోకి లోహపు వస్తువులతో వెళ్లకూడదని అంటారు. మిషన్ ఆఫ్ చేసినా కూడా ఇలాంటి పనులు చేయకూడదని అంటారు. అయితే అనుకోకుండా కొంతమంది ఇలాంటి పిచ్చిపనులు చేస్తుంటారు. తెలిసో తెలియకో మిషన్ ఆకర్షణకు గురై ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లు ఈ ఆకర్షణ ప్రభావంతో మిషన్ లోపలికి వెళ్లిపోయి గాయాలపాలయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సంఘటనే న్యూయార్క్ లో జరిగింది. అయితే తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి మరణించడం ఇక్కడ మరింత సంచలనంగా మారింది. ఫైనల్ డెస్టినేషన్ సినిమాలో కూడా ఇలాంటి సీన్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఆ సీన్ రిపీట్ అయినట్టు అనిపిస్తోంది.
MRI మిషన్ విషయంలో సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు నిపుణులు. స్కానింగ్ కోసం వచ్చే పేషెంట్లు, వారి సహాయకులకు తగిన సూచనలు ఇవ్వాలని అంటారు. చైన్లు లేదా ఇతర ఆభరణాలు ధరించిన వారిని వారు పొరపాటున కూడా లోపలికి అనుమతించకూడదని అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి. అయితే ఈ తప్పులకు భారీ మూల్యం చెల్లించు కోవాల్సి ఉంటుంది.