Indiramma Housing Scheme: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది ఇందిరమ్మ ఇళ్ల పథకం. గ్రామీణ ప్రాంతాలలో వాటికి సంబంధించిన ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించింది. జీ+1 తరహాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణలో పట్టణాల్లో నివసించే పేదలకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పథకం ఇకపై పట్టణాలకు వర్తించనుంది. తక్కువ స్థలం ఉన్నవారు సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. జీ ప్లస్-1 అంటే గ్రౌండ్ + ఫస్ట్ ఫ్లోర్ పద్ధతిలో ఇల్లు నిర్మించుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే విల్లా తరహాలో అన్నమాట. ఈక్రమంలో బుధవారం జీవో 69ను జారీ చేసింది.
బుధవారం సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్ష నిర్వహించారు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. పట్టణాల్లో స్థలాల సమస్య నేపథ్యంలో సడలింపులు ఇచ్చారు. 400 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలంలో 323 చదరపు అడుగుల(30 చదరపు మీటర్ల) విస్తీర్ణంలో జీ ప్లస్ 1 పద్దతిలో ఇల్లు కట్టుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో 200 చదరపు అడుగుల చొప్పున నిర్మాణం చేపట్టవచ్చని వివరించారు.
ఇకపై పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్లు
జీ+1 విధానంలో చేపట్టి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనుంది. నాలుగు దశల్లో లబ్ధిదారులకు ఈ నిధులను అందజేయనుంది. ఈ విషయాన్ని జీవోలో ప్రధానంగా ప్రస్తావించారు. తొలుత బేస్‌మెంట్ లెవల్, ఆ తర్వాత రూఫ్ లెవల్ నిధులు ఇవ్వనుంది. మొదటి అంతస్తు నిర్మాణం, ఇల్లు పూర్తయ్యాక విడతలవారీగా ఈ సాయం విడతల వారిగా ఇవ్వనుంది.
ఇంట్లో కనీసం రెండు గదులు, ఒక వంటగది, ప్రత్యేక మరుగుదొడ్డి తప్పనిసరి చేసింది. ఆర్సీసీ స్లాబ్‌తో నిర్మించే ఇళ్లకు హౌసింగ్ శాఖ అనుమతి తప్పనిసరి. పట్టణ ప్రాంతాల్లో పేదల ఇంటి కోసం కొద్దికాలంగా ఆయా ఇళ్ల నిర్మాణాలపై అధ్యయనం చేశామని సదరు మంత్రి చెప్పారు. చాలామంది 60 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలో తాత్కాలిక షెడ్లతో జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు.
ALSO READ: ఎట్టకేలకు ఆ ఊరికి బస్సు సర్వీసు.. మూడు దశాబ్దాల కల
ఈ సమస్యను అధిగమించడానికి పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనుమతి ఇచ్చినట్టు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం ఒకెత్తయితే, పట్టణ ప్రాంతాల్లో మరో ఎత్తు అని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.