Trump Mexico counter Claudia Sheinbaum | రెండోసారి అగ్రరాజ్య అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందే పొరుగు దేశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత, కెనడా, గ్రీన్‌లాండ్, పనామా కాలువలను అమెరికాలో విలీనం చేస్తానని చెప్పిన ట్రంప్, గల్ఫ్ ఆఫ్ మెక్సికోను “గల్ఫ్ ఆఫ్ అమెరికా”గా మారుస్తానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ స్పందిస్తూ, “అమెరికాకు కాబోయే అధ్యక్షుడికి గట్టి కౌంటర్ ఇచ్చారు.”
బుధవారం జనవరి 8, 2025 (స్థానిక కాలమానం ప్రకారం) మీడియా సమావేశంలో క్లాడియా షేన్‌బామ్ మాట్లాడుతూ.. 17వ శతాబ్దం నాటి ప్రపంచపటాన్ని చూపించారు. అప్పట్లో ఉత్తర అమెరికా.. “మెక్సికన్ అమెరికా” అని పిలువబడేదని గుర్తుచేశారు. “గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ఐక్యరాజ్య సమితి గుర్తించిందని మర్చిపోవద్దు” అని పరోక్షంగా ట్రంప్‌ను ఉద్దేశిస్తూ చెప్పారు. “మనం యునైటెడ్ స్టేట్స్‌ను ‘మెక్సికన్ అమెరికా’ అని పిలవకూడదా? ఇది చాలా బాగుంటుంది కదా?” అని చమత్కారంగా ప్రశ్నించారు. అలాగే, అమెరికాకు కొత్త అధ్యక్షుడు (డొనాల్డ్ ట్రంప్) బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలనే తాము కోరుకుంటున్నామని తెలిపారు.
Also Read: ప్రిన్సెస్ డయానాకు సైట్ కొట్టిన ట్రంప్.. ఛీకొట్టిన యువరాణి.. ఆ లవ్ స్టోరీ తెలుసా?
జనవరి 20న ట్రంప్.. అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, గత కొద్ది రోజులుగా అమెరికా విస్తరణ కాంక్షలను ఆయన ప్రకటిస్తున్నారు. ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, “గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలని అనుకుంటున్నాను. అదే సరైనది!” అని అన్నారు. “లక్షలాది మంది అక్రమంగా మా దేశంలోకి ప్రవేశించడం వలన, మెక్సికో ఆ దేశాన్ని అడ్డుకోవాలి. ఆ దేశాన్ని మాదకదవ్యాల ముఠాలు నడిపిస్తున్నాయి” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతకుముందు కూడా, అక్రమ వలసదారులు మరియు డ్రగ్స్ రవాణాను అడ్డుకోకపోతే, మెక్సికోపై కఠినంగా పన్నులు విధిస్తామని హెచ్చరించారు.
మరోవైపు కెనెడా దేశాన్ని అమెరికాలో 51వ రాష్ట్రంగా విలీనం చేయాలని ఆయన పలుమార్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. కెనెడా ప్రభుత్వం జాతీయ భద్రత కోసం మిలిటరీపై చాలా తక్కువ ఖర్చు చేస్తోందని.. ఆ దేశ సరిహద్దుల భద్రతా బాధ్యతలు కూడా అమెరికా సైన్యం నిర్వర్తిస్తోందన్నారు. అయితే ఇదంతా ఇకపై ఉచితంగా ఉండదని కెనెడాపై పన్నులు విధిస్తామన్నారు. ఆ తరువాత కూడా సోషల్ మీడియాలో అమెరికాలో కెనెడా ఒక భాగంగా చూపిస్తూ ట్రంప్ ఒక కొత్త అమెరికా మ్యాప్ షేర్ చేశారు. రష్యా, చైనాల నుంచి సముద్రంలో అడ్డుకోవడానికి కెనెడాని అమెరికాలో విలీనం కావాల్సిందేనన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను కెనెడా తాత్కాలిక ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఖండించారు. ట్రంప్ చెప్పినట్లు జరిగేందుకు ప్రసక్తే లేదన్నారు.
అయితే జస్టిన్ ట్రూడో సమాధానాన్ని ట్రంప్ సన్నిహితుడు, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అయిన ఎలన్ మస్క్ ఎద్దేవా చేశారు. జస్టిన్ ట్రూడో కెనెడా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారని.. ఆయనకు ఎటువంటి అధికారాలు లేవని అన్నారు. అలాంటి వ్యక్తి వ్యాఖ్యలకు విలువ లేదని మస్క్ చురకలంటించారు.