Laser Hair Removal: లేజర్ ట్రీట్మెంట్ అనేది అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించడానికి ఒక ఆధునిక పద్ధతి. ఈ పద్ధతిలో.. లేజర్ కాంతిని ఉపయోగించి వెంట్రుకల కుదుళ్లను దెబ్బతీస్తారు/ తద్వారా వెంట్రుకలు తిరిగి పెరగకుండా నిరోధించవచ్చు. ఈ చికిత్స చేయించుకోవడానికి ప్రస్తుతం చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ముఖంపై ఈ చికిత్స చేయించుకునేటప్పుడు కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది. వాటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
సాధారణంగా కనిపించే సైడ్ ఎఫెక్ట్స్:
చర్మం ఎర్రబడటం, వాపు: లేజర్ ట్రీట్మెంట్ తర్వాత.. ఆ ప్రాంతంలో చర్మం ఎర్రగా మారడం, కొద్దిగా వాపు రావడం సర్వసాధారణం. ఇది సాధారణంగా కొన్ని గంటల నుంచి ఒక రోజులో తగ్గిపోతుంది. ఈ సమయంలో చర్మాన్ని చల్లగా ఉంచడానికి ఐస్ ప్యాక్ ఉపయోగించవచ్చు.
కొద్దిపాటి నొప్పి లేదా అసౌకర్యం: చికిత్స సమయంలో.. కొద్దిగా మంటగా లేదా రబ్బర్ బ్యాండ్‌తో కొట్టినట్లు అనిపించవచ్చు. చికిత్స తర్వాత కూడా కొన్ని గంటల పాటు కొద్దిపాటి అసౌకర్యంగా ఉంటుంది.
చర్మం రంగులో మార్పు: లేజర్ చికిత్స తర్వాత.. చర్మం కొద్దిగా పాలి పోయినట్లుగా లేదా ముదురు రంగులోకి మారే అవకాశం ఉంది. ఇది సాధారణంగా కొన్ని వారాల తర్వాత తగ్గిపోతుంది. ముదురు చర్మం ఉన్నవారిలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. చికిత్సకు ముందు, తర్వాత సూర్యరశ్మికి గురి కాకుండా జాగ్రత్తపడటం ఈ సమస్యను నివారిస్తుంది.
చర్మం పొడిబారడం లేదా దురద: లేజర్ చికిత్స వల్ల చర్మం పొడిబారి, దురదగా అనిపించవచ్చు. ఇలాంటి సమయాల్లో మాయిశ్చరైజర్ ఉపయోగించడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
అరుదుగా కనిపించే సైడ్ ఎఫెక్ట్స్:
పొక్కులు లేదా పుండ్లు: చాలా అరుదుగా.. లేజర్ శక్తి ఎక్కువగా ఉంటే లేదా చికిత్స సరిగ్గా చేయకపోతే చర్మంపై చిన్న పొక్కులు లేదా పుండ్లు ఏర్పడతాయి. ఇలాంటివి ఏర్పడినప్పుడు వెంటనే నిపుణులను సంప్రదించాలి.
ఇన్ఫెక్షన్: లేజర్ చికిత్స తర్వాత చర్మాన్ని సరిగ్గా శుభ్రంగా ఉంచుకోకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
వెంట్రుకలు తిరిగి పెరగడం: కొన్ని సందర్భాలలో.. లేజర్ చికిత్స తర్వాత వెంట్రుకలు మరింత ఒత్తుగా, నల్లగా తిరిగి పెరగుతాయి. దీనిని పారడాక్సికల్ హైపర్‌ట్రైకోసిస్అంటారు. ఇది సాధారణంగా ముఖంపై చికిత్స చేయించుకునేవారిలో.. ముఖ్యంగా హార్మోన్ల సమస్యలు ఉన్నవారిలో అరుదుగా సంభవిస్తుంది.
ముందు జాగ్రత్తలు:
లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకోవాలనుకుంటే.. అనుభవం, నైపుణ్యం ఉన్న నిపుణుడిని లేదా క్లినిక్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
చికిత్సకు ముందు.. మీ చర్మ రకం, వెంట్రుకల రకం, ఆరోగ్య సమస్యల గురించి నిపుణుడికి స్పష్టంగా చెప్పాలి.
చికిత్స తర్వాత.. సూర్యరశ్మికి దూరంగా ఉండటం, సన్‌స్క్రీన్ లోషన్ ఉపయోగించడం తప్పనిసరి.
ఏదైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే చికిత్స చేసిన నిపుణులను సంప్రదించాలి.