ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ ఆయుధ సామర్థ్యం ఏంటనేది అందరికీ తెలిసొచ్చింది. భారత్ ప్రయోగించిన మిసైల్స్ ని అడ్డుకునే రక్షణ వ్యవస్థ పాక్ కి లేదు. అదే సమయంలో పాక్ ప్రయోగించిన మిసైల్స్ ని భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. అంటే పాకిస్తాన్ కి యుద్ధం చేయడంలో ఉన్న ఉత్సాహం, యుద్ధ సామగ్రిని సిద్ధం చేసుకోవడంలో లేదని తేలిపోయింది. పాకిస్తాన్ కి ఆయుధాలు సరఫరా చేసే చైనా చీప్ ట్రిక్స్ కూడా పాక్ కి శాపంగా మారాయి. నాశిరకం చైనా యుద్ధ సామగ్రి పాక్ కొంప ముంచింది. అయితే తిరిగి చైనా సహాయంతోనే పాక్ మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. సీక్రెట్ గా ఆయుధ సామగ్రిని సిద్దం చేసుకుంటోంది. అయితే ఇది భారత్ పై ప్రయోగించడానికి మాత్రం కాదు. పాకిస్తాన్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నట్టు అమెరికా నిఘా సంస్థలు పేర్కొనడం విశేషం.
5,500 కిలోమీటర్ల టార్గెట్..
పాకిస్తాన్ కి ఎప్పుడూ పొరుగున ఉన్న భారత్ తోనే వైరం. భారత్ కాకుండా ఇతర దేశాలతో పాక్ యుద్ధం చేయడం చాలా అరుదు. అంటే పాక్ లక్ష్యం ఎప్పుడూ తక్కువ దూరంలోనే ఉంటుంది. అందులోనూ పాక్ ఎక్కువగా జమ్మూకాశ్మీర్, పంజాబ్ వంటి సరిహద్దు ప్రాంతాలనే టార్గెట్ చేస్తుంది. అంతకు మించి ఎక్కువదూరం వెళ్లే మిసైళ్లు పాక్ వద్ద ప్రస్తుతానికి రెడీగా లేవు. వీటిని ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు అంటారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఈ ఖండాతర బాలిస్టిక్ క్షిపణుల తయారీని మొదలు పెట్టింది. దీనికి కూడా చైనా సహకారం అందిస్తోంది. 5,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యం వీటికి ఉంటుందని అమెరికా అంచనా వేస్తోంది. అంటే అమెరికా రాజధానిక వాషింగ్టన్ ను సైతం టార్గెట్ చేయగల సత్తా ఇకపై పాక్ కి ఉంటుంది.
సిందూర్ తో గుణపాఠం..
భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ హడలిపోయిందని, ఆయుధ సంపత్తి విషయంలో తన స్థానం ఏంటో తెలుసుకుందని, అందుకే చైనా సహాయంతో తమ ఆయుధాలను అభివృద్ధి చేసుకోవాలని భావిస్తోందని అమెరికా నిఘా వర్గాలంటున్నాయి. దానికి అనుగుణంగానే అమెరికాలోని పలు లక్ష్యాలను సైతం ఛేదించగలిగేలా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను రహస్యంగా అభివృద్ధి చేస్తోంది. అయితే ఇలాంటి బాలిస్టిక్ క్షిపణుల్ని తయారు చేసినా, లేక కొనుగోలు చేసినా… అలాంటి దేశాలను అమెరికా తమ అణ్వాయుధ ప్రత్యర్థిగా గుర్తిస్తుంది. మరి పాకిస్తాన్ విషయంలో అమెరికా అలాంటి చర్యలకు సిద్ధపడుతుందో లేదో చూడాలి.
అసలు టార్గెట్ ఎవరు..?
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులతో అమెరికాలోని కీలక ప్రాంతాలను సైతం పాకిస్తాన్ టార్గెట్ చేయగలుగుతుంది అనేది యూఎస్ నిఘా వర్గాల సమాచారం. అసలు అమెరికాని టార్గెట్ చేయాల్సిన అవసరం పాకిస్తాన్ కు ఏముంటుంది..? ఒకవేళ నిజంగా టార్గెట్ చేసినా, ఆ మరుక్షణం పాక్ పరిస్థితి ఏంటనేది వారికి తెలియదా..? అయితే పాక్ అసలు టార్గెట్ అమెరికా లాంటి దూర దేశాలు కాదు, పొరుగున ఉన్న భారత్ లోని సుదూర లక్ష్యాలను కూడా సులభంగా ఛేదించేందుకే పాకిస్తాన్ ఇలాంటి కుయుక్తులు పన్నుతోందని అంటున్నారు. ఈ బాలిస్టిక్ క్షిపణుల లక్ష్యం ఏంటనేది ముందు ముందు తేలిపోతుంది.