Afghan Boy: సినిమాల్లో చూపించే కొన్ని సన్నివేశాలు నిజ జీవితంలోనూ జరుగుతున్నట్టు అనిపించే ఒక షాకింగ్ ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. కేవలం 13 సంవత్సరాల వయసున్న ఒక అఫ్గాన్ బాలుడు తన ప్రాణాలను పణంగా పెట్టి విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని కాబూల్ నుంచి ఢిల్లీకి చేరాడు. ఆదివారం జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
కామ్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం నంబర్ ఆర్‌క్యూ-4401 ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన కొద్ది సేపటికే సిబ్బంది ఒక చిన్న బాలుడు ఎయిర్‌పోర్ట్‌లో తిరుగుతున్నాడని గమనించారు. వెంటనే సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారు. విచారణ జరపగా అతను విమానం వెనుక భాగంలోని ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని వచ్చినట్లు బయటపడింది. అతను అఫ్గానిస్తాన్‌లోని కుందుజ్ నగరానికి చెందినవాడని గుర్తించారు.
విమాన ఇంజినీరింగ్ టీమ్ ల్యాండింగ్ గేర్ ప్రాంతాన్ని సేఫ్టీ చెక్ చేస్తే ఒక చిన్న ఎరుపు రంగు స్పీకర్ కూడా అక్కడ కనిపించింది. అధికారులు బాలుడిని ప్రశ్నించి అన్ని వివరాలు సేకరించారు. చివరికి అతడిని తిరిగి పంపే నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం బయలుదేరిన మరో కామ్ ఎయిర్ ఫ్లైట్ ఆర్‌క్యూ-4402లో తిరిగి స్వదేశానికి తిరిగి పంపించారు.
ల్యాండింగ్ గేర్‌లో దాక్కోవడం అనేది అత్యంత ప్రమాదకరం. ఫ్లైట్ ఎత్తుకు వెళ్లేటప్పుడు ఉష్ణోగ్రత -60 డిగ్రీల వరకు పడిపోతుంది. ఆక్సిజన్ స్థాయి కూడా గణనీయంగా తగ్గిపోవడం వల్ల గడ్డకట్టిపోవడం, స్పృహ కోల్పోవడం, మృతి చెందడం, ఇవి తప్పనిసరిగా మారతాయి. అంతేకాకుండా చక్రాల ఒత్తిడికి నలిగిపోవడం, కిందపడిపోవడం వంటి ప్రమాదాలూ ఉన్నాయి.
Also Read: Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు
ఇలాంటి ప్రయత్నాల్లో ఐదుగురిలో ఒకరే బతికే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలాంటి ప్రమాదంలోను ఈ బాలుడు బతికిపోయాడు అంటే అదృష్టం తప్ప మరేం కాదని అంటున్నారు. అసలు ఈ బాలుడు ఇంతలా రిస్క్ చేసి ఢిల్లీకి ఎందుకు వచ్చాడు అనేది పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. అంతే కాదు అసలు ప్లైట్ లో టైర్ వద్ద కూర్చొని ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణించడం ఏంటని షాకింగ్ కి గురిచేస్తుంది. ఏదైతేనేం చివరకు ఆ బాలున్ని గుర్తుపట్టి అఫ్గానిస్తాన్ అయితే పంపడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
భారతదేశంలో ఇది రెండోసారి వెలుగులోకి వచ్చిన విమానంలో దాక్కుని ప్రయాణించిన కేసు. 1996లో ఢిల్లీ నుంచి లండన్ వెళ్ళే బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లో ఇద్దరు సోదరులు దాక్కున్నారు. వారిలో ఒకరు బతికారు కానీ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. అప్పటినుంచే ఇలాంటి ప్రయత్నాలు ఎంత ప్రమాదకరమో ఉదాహరణగా చెప్పబడుతోంది.
ఈ ఘటనపై ప్రజల దృష్టిని ఆకర్షించిన అంశం ఏమిటంటే, బాలీవుడ్ చిత్రం “షిద్ధత్” లోనూ హీరో విమానం టైరులో దాక్కునే సన్నివేశం ఉండటం. కానీ సినిమా చూపినట్టుగా ఇది రొమాంటిక్ సాహసం కాదు. వాస్తవంలో మాత్రం ఇది ప్రాణాలను ప్రమాదంలో పడేసే అత్యంత రిస్క్ అని అధికారులు చెబుతున్నారు.
ఈ సంఘటన తర్వాత ఎయిర్‌పోర్ట్ అధికారులు ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధమని, ప్రాణాంతకమని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. సమయానికి స్పందించిన కామ్ ఎయిర్ సిబ్బంది, సిఐఎస్‌ఎఫ్ అధికారులు, ఇంజినీరింగ్ టీమ్ కారణంగానే ఆ బాలుడి ప్రాణం కాపాడబడిందని వారు స్పష్టం చేశారు.