జులై 5న జలప్రళం ప్రపంచాన్ని ముంచేస్తుందా..?
జపాన్ న్యూ బాబా వాంగ జ్యోతిష్యం నిజమవుతుందా..?
జపాన్ సముద్రజలాల్లో స్లోమోషన్ భూకంపం దేనికి సంకేతం..?
జులై-5
జులై-5. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్ని వణికిస్తున్న తేదీ ఇది. జులై-5న ప్రళయం ముంచుకొస్తుందని కొంతమంది అంచనావేసి మరీ చెప్పారు. ఆ అంచనాలు నిజమయ్యేలా శాస్త్రవేత్తలు వెల్లడించిన కొన్ని వాస్తవాలు సంచలనం రేకెత్తించాయి. జపాన్‌లో పసిఫిక్ మహాసముద్రం కింద సునామీ ప్రమాదకర ఫాల్ట్ జోన్‌లో అరుదైన స్లో-మోషన్ భూకంపాన్ని అక్కడి శాస్త్రవేత్తలు గుర్తించారు. స్లో స్లిప్ ఎర్త్ క్వేక్ గా దీన్ని పిలుస్తారు. సూక్ష్మ భూకంప కదలికలను అధునాతన బోర్‌హోల్ అబ్జర్వేటరీల ద్వారా గుర్తించారు. మొదట ఇలాంటి స్లోమోషన్ భూకంపాలు వచ్చి, ఆ తర్వాత ఒక్కసారిగా భారీ భూకంపం సంభవించే అవకాశముందని వారు అనుమానిస్తున్నారు.
స్లో స్లిప్..
మనకు తెలిసి భూకంపం అంటే.. భూమి లోపలి పొరల్లో సర్దుబాటు. ఈ సర్దుబాటు కొన్ని క్షణాలనుంచి నిమిషాల వరకు ఉంటుంది. సర్దుబాటు అయ్యే క్రమంలో భూమిపై ఉన్న భవంతులు పడిపోతాయి, ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇవే సర్దుబాట్లు సముద్రంలోపల జరిగితే.. దానివల్ల సముద్ర జలాలు భూమిపైకి పోటెత్తుతాయి. రాక్షస అలలు తీర ప్రాంతాలను ముంచెత్తుతాయి. దీన్ని సునామీ అంటాం. ప్రస్తుతం జపాన్ లో పసిఫిక్ మహాసముద్రం అడుగున స్లో స్లిప్ భూకంపాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల ఒకేసారి పెద్ద నష్టం జరగదు. ఇది కొన్నివారాలపాటు కొనసాగుతుంది. అయితే అతిపెద్ద భూకంపానికి దీన్ని తొలి హెచ్చరికగా భావించవచ్చు. ప్రత్యేక పరికరాలతో దీన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు.
సునామీ అంచనా..
యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ జియోఫిజిక్స్ కి చెందిన జోష్ ఎడ్జింగ్టన్ ఈ దృగ్విషయాన్ని వివరించారు. ఈ సూక్ష్మ కదలికలు పెద్ద వినాశకారులు కాకపోయినా.. సబ్‌డక్షన్ జోన్‌లలోని లోపాలను గుర్తించడానికి ఇవి ఉపయోగపడతాయని, సునామీ వచ్చే అవకాశాలను అంచనా వేయొచ్చని చెప్పారు.
అయితే ఇప్పుడు ఈ అంచనాలు మరింత భయం కలిగించేలా ఉన్నాయి. ఎందుకంటే జులై-5న జల విలయం తప్పదని జపాన్ కి చెందిన న్యూ బాబా వాంగ జ్యోతిష్యం చెప్పారు. ఆమె అంచనాల ప్రకారం జులై-5న సునామీ వస్తుందని అంటున్నారు. ఆ అంచనాకు, ఇప్పుడు సైంటిస్ట్ లు కనిపెట్టిన స్లో స్లిప్ భూకంపాలకు పోలిక సరిపోవడంతో ప్రజలు మరింత భయపడుతున్నారు.
జపాన్ లో భయం భయం..
బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వాంగ మాదిరిగా, జపాన్ లో కూడా ఒక బాబా వాంగ వెలుగులోకి వచ్చారు. ఆమె అసలు పేరు రియో టాట్సుకి. 1999 కూడా ఆమె ఓ పుస్తకం రాశారు. నేను చూసిన భవిష్యత్తు అనే ఆ పుస్తకంలో 2025 జులై-5 ప్రస్తావన ఉంది. ఆ రోజున సునామీ వచ్చి జపాన్ తుడిచిపెట్టుకు పోతుందని చెప్పారామె. ఆమె గతంలో కరోనా గురించి కూడా హెచ్చరించారు. బ్రిటన్ యువరాణి డయానా మృతి గురించి కూడా గతంలోనే ఆమె ఊహించి చెప్పారు. అవన్నీ నిజం కావడంతో ఈ సునామీ కూడా నిజమయ్యే అవకాశాలున్నాయని జపాన్ వాసులు వణికిపోతున్నారు. న్యూ బాబా వాంగ సునామీ హెచ్చరికలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. జపాన్ పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయింది. పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను తగ్గించాయి. పర్యాటక బుకింగ్‌లు 30 శాతం పడిపోయాయి. ఈ వార్తల వల్ల జపాన్ ఆర్థిక వ్యవస్థకు సుమారు 560 బిలియన్ యెన్లు నష్టం వాటిల్లుతోందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ వార్తలకు జులై-5తో చెక్ పడుతుందని కొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు.