Sweet Potato : మోరంగడ్డను ఇష్టపడని వారు ఎవరు? ఇమ్యూనిటీని పెంచే ఈ గడ్డను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. చిలగడదుంప,రత్నపురిగడ్డ, దెనుసుగడ్డ అని కూడా వ్యవహరిస్తారు. ఐరన్,మెగ్నీషియమ్, విటమిన్ ఏ, సీ అధికంగా ఉండే మోరంగడ్డలు ఒక్కో మొక్కకు మహా అయితే 2.5 కిలోల వరకు వస్తాయి. కానీ జార్జియాకు చెందిన ఓ వ్యక్తి పొలంలో ఏకంగా 84.4 కిలోల దిగుబడి వచ్చింది.
వాషింగ్టన్ కౌంటీ రైతు డేవిడ్ ఆండర్సన్ సాధించింది ఓ రకంగా రికార్డే. ఇప్పటివరకు గిన్నిస్ రికార్డుల్లో నమోదైంది 37 కిలోలే. 2004లో స్పెయిన్ రైతు మాన్యువల్ పెరెజ్ పేరిట ఆ రికార్డు ఉంది. ఆండర్సన్ ఇప్పుడా రికార్డును అధిగమించేసినట్టే. ఈసారి వాతావరణం అనుకూలంగా ఉండటంతో మోరంగడ్డ దిగుబడి బాగా వచ్చిందని ఆయన
చెబుతున్నాడు.
గిన్నిస్ రికార్డు నిబంధనల మేరకు ఒక తీగకు వచ్చిన మోరంగడ్డలన్నింటి బరువును లెక్కిస్తారు. మంచి దుంపలనే
లెక్కలోకి తీసుకున్నా.. గిన్నిస్ రికార్డుకు ఆండర్సన్ రెట్టింపు దిగుబడిని సాధించినట్టే. ప్రపంచ రికార్డు కోసం వివరాలన్నింటినీ ఆయన గిన్నిస్ నిర్వాహకులకు అందజేశారు.