ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అండిషే పట్టణంలోని ప్రముఖ వాణిజ్య సముదాయం ‘అర్ఘవాన్ షాపింగ్ సెంటర్’లో మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 50 అంతస్తుల భారీ భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 250 వాణిజ్య విభాగాలకు నిలయంగా ఉన్న ఈ భవనంలో మంటలు వేగంగా విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. భవనం లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ భారీ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం అమెరికాతో ఇరాన్ కాల్పుల విరమణ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ ఘటనకు ఆ రాజకీయ పరిణామాలకు ఎలాంటి సంబంధం లేదని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇది కేవలం ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా అధికారులు భావిస్తున్నారు. భవనంలోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు పుట్టినట్లు అనుమానిస్తున్నారు.
ఘటన జరిగిన సమయంలో షాపింగ్ సెంటర్‌లో వందలాది మంది ప్రజలు ఉన్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్తి నష్టం కూడా భారీగా సంభవించింది. 50 అంతస్తుల భవనం కావడంతో పై అంతస్తుల్లో చిక్కుకున్న వారిని కిందకు దించడం అగ్నిమాపక దళానికి సవాలుగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: దళపతి విజయ్ కాదు… సీఎం విజయ్ సర్ప్రైజ్ ఇచ్చిన జననాయగన్ టీమ్