Trump campaign blames Iran for hacked emails: నవంబర్ నెలలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రత్యర్థుల ప్రచార హోరుతో వేడెక్కింది. అటు కమలాహ్యారిస్, ఇటు డొనాల్డ్ ట్రంప్ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు, పొలిటికల్ డిబేట్ లుతో వాతావరణాన్ని ఒక్కసారిగా హీట్ ఎక్కించేస్తున్నారు. ప్రతి చిన్న అంశాన్నీ తనకు అనుకూలంగా మార్చుకునే మేధావి ట్రంప్. ఈ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఇరాన్ దేశంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన పర్సనల్ ఈ మెయిల్ హ్యాకింగ్ కు గురయిందని అంటున్నారు. అందులో తన ఆంతరంగిక సందేశాలు, సమాచారం ఉందని..దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నానని ట్రంప్ అన్నారు.
ఇరాన్ కుట్రకోణం
దీని వెనుక కుట్ర కోణం దాగి ఉందని..ఇదంతా ఇరాన్ దేశం పనే అంటూ ఇరాన్ పై విరుచుకుపడుతున్నారు. అమెరికాకు చెందిన ఓ పొలిటికల్ వెబ్ సైట్ ఈ ఉదంతాన్ని బయటపెట్టింది. కేవలం అమెరికాకు సంబంధించిన ఎన్నికలలో జోక్యం చేసుకోవడానికే ఇరాన్ ఈ పని చేసిందని ఆ వెబ్ సైట్ కథనం. ట్రంప్ ఈ ఎన్నికలలో ఎలాగైనా సరే ఓడిపోవాలని..అందుకోసమే ఈ పని చేసినట్లు తెలుస్తోందని వార్తాకథనాలను వండి వార్చింది. దాదాపు ట్రంప్ పర్సనల్ సమాచారానికి సంబంధించిన 271 పేజీల మేరకు హ్యాకింగ్ కు గురయిందని తెలిపింది.
అధ్యక్ష ఎన్నికలపై ఆరా
గత కొంతకాలంగా ఇరాన్ వ్యవహారాలను గమనిస్తున్న మైక్రోసాఫ్ట్ థ్రెట్ అనాలసిస్ సెంటర్ ఓ నివేదిక విడుదల చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు సమాచారం సేకరించేందుకు..అమెరికా ఎన్నికలలో పెద్ద ఎత్తున హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు ఇరాన్ ఈ పని చేస్తోందని తమ నివేదికలో తెలిపారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి అతి తక్కువ సమయంలోనే హ్యాకింగ్ లకు పాల్పడుతోందని అంటున్నారు. అయితే ట్రంప్ ఈ మెయిల్స్ నే ఎక్కువగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
అమెరికా మద్దతు ఇజ్రాయెల్ కే
ఇజ్రాయెల్, ఇరాన్ కు మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. మొదటినుంచి అమెరికా ఇజ్రాయెల్ కు అండగా నిలుస్తూ వస్తోంది. ఇజ్రాయెల్ కు అంతర్లీనంగా ఆయుధాలు సరఫరా చేస్తోంది. అధ్యక్ష ఎన్నికలు అయిపోయాక ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై అమెరికా దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంది. అందుకని ఇరాన్ ముందుగానే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని భావిస్తున్నారు. ఇక ట్రంప్ కూడా అమెరికా పౌరుల మద్ధతు కోసం ఇరాన్ పై ద్వేషపూరిత ఆరోపణలు చేస్తున్నారని ఇరాన్ దేశం అంటోంది. ఇది తమ పని కాదని ఖండిస్తోంది.