iPhone Air China Sales| ఆపిల్ తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 17 సిరీస్ భాగంగా ఒక స్లిమ్ మోడల్ అయిన ఐఫోన్ ఎయిర్‌ని కూడా లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ మిగతా దేశాలతో పోలిస్తే.. కాస్త ఆలస్యంగా ఇటీవల చైనాలో విడుదలైంది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఐఫోన్ ఎయిర్ స్టాక్ అంతా అమ్ముడు పోయింది. చైనీయులు ఈ మోడల్ ని కొనేందుకు క్యూ కడుతున్నారు. చైనా ప్రజలు సూపర్ స్లిమ్, అల్ట్రా థిన్ ఫోన్ మోడల్స్ అంటే ఎక్కువ ఇష్టపడతారు. ఈ కారణంగానే అక్కడ ఐఫోన్ ఎయిర్ విడుదలైన రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ప్రతి చోట నో స్టాక్ బోర్డు దర్శనమిస్తున్నాయి. దీంతో ఐఫోన్ ఎయిర్ ఆర్డర్స్ ఇతర దేశాల నుంచి చైనాకు షిప్పింగ్ ప్రారంభించింది ఆపిల్ కంపెనీ. ఒక వస్తువు ఈ స్థాయిలో డిమాండ్ తో సేల్ అయితే చైనీయులు దాన్ని “హువాబో” అనే పదంతో వర్ణిస్తారు. అంటే అగ్గి లాంటి డిమాండ్ అని అర్థం. చైనాలో ఐఫోన్ ఎయిర్ సేల్స్ చూసి మార్కెట్ విశ్లేషకుల అంచనాలు తలకిందలయ్యాయి. నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఈ ఫోన్ ప్రపంచ దేశాల్లో సరైన ఆదరణ పొందడంలో విఫలమైంది. ఐఫోన్ ఎయిర్ తొలిగా అమెరికాలో విడుదలైంది. అమెరికన్ కస్టమర్‌లు ఈ ఫోన్ కొనడానికి ఇష్టపడలేదు. నిజానికి, అమెరికన్ కస్టమర్‌లు ప్రో మాక్స్ మోడల్‌లో ఎక్కువ ఆసక్తి చూపించారు. తక్కువ ఫీచర్లు ఉన్న స్టాండర్డ్ ఐఫోన్ ఎయిర్ మోడల్ లాంచ్ సమయంలో అమ్ముడుపోలేదు. కానీ చైనాలో పరిస్థితి భిన్నంగా ఉంది. చైనా కస్టమర్‌లు ఆపిల్ స్టోర్‌ల బయట భారీ క్యూల్లో నిలబడి మరి విడుదలైన రోజే ఐఫోన్ ఎయిర్ కు ఘన స్వాగతం పలికారు. ఆన్‌లైన్ ప్రీ-ఆర్డర్స్ లో కూడా రికార్డ్స్ బద్దలయ్యాయి.
ఐఫోన్ ఎయిర్ మొదట చైనాలో విడుదల కాలేదు. ఎందుకంటే ఈ స్లిమ్ ఫోన్ లో eSIM-మాత్రమే మోడల్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. కానీ చైనా మార్కెట్ భౌతిక SIM కార్డ్‌లపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది, ఇందుకు ఆపిల్‌కు ప్రభుత్వ అధికారులతో సమస్యను పరిష్కరించేందుకు సమయం అవసరం అయ్యింది. ఇటీవలే చైనాలో కూడా ఆపిల్ eSIM-మాత్రమే అంటూ ప్రకటనను విడుదల చేశారు. అలా చైనీయులకు eSIM గురించి అవగాహన కల్పించిన తరువాత విడుదల చేశారు.
CEO టిమ్ కుక్ చైనాలో ఐఫోన్ ఎయిర్ విడుదలను ప్రమోట్ చేయడానికి వ్యక్తిగతంగా హాజరయ్యారు. కుక్ చైనా సోషల్ మీడియా సైట్‌లను ఉపయోగించి భారీగా నిమగ్నమయ్యారు. ఆయన కీలక ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడారు. ఈ పర్యటన ఆపిల్‌కు చైనా ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో తెలియజేస్తోంది. ఇప్పుడు ఐఫోన్స్ అక్కడ భారీ స్థాయిలో సేల్స్ చూస్తుండడంతో ఆలస్యం అయిన మంచి ఆదరణ పొందుతోంది.
భారీ స్థాయిలో డిమాండ్ ఉండడంతో చైనా విక్రయదారులకు కొత్త సమస్య వచ్చి పడింది. ప్రీ-ఆర్డర్ సమయంలో కస్టమర్లు ఎగబడి మరీ ఆర్డర్ చేయడంతో ఆపిల్ అధికారిక చైనా వెబ్‌సైట్ తాత్కాలికంగా కూలిపోయింది. థర్డ్-పార్టీ రిటైలర్ JD.com కూడా ఆల్ టైమ్ రికార్డ్ సేల్స్ రిపోర్ట్ చేసింది. స్టాక్ అయిపోయినా లక్షలాది రిజర్వేషన్ ఆర్డర్ రిక్వెస్ట్ లు వస్తున్నాయి. డిమాండ్ ముఖ్యంగా బేస్ ఐఫోన్ 17 కోసం బలంగా ఉంది. ఇందులోని కొత్త ప్రోమోషన్ డిస్ప్లే వల్ల బేస్ మోడల్ కు ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి.
సేల్స్, ఆర్డర్స్ విపరీతంగా ఉండడంతో ఆపిల్ ఒకరకంగా చైనా మార్కెట్ లో కంబ్యాక్ ఇచ్చింది. ఎందుకంటే.. 2023లో ఈ ప్రాంతంలో ఐఫోన్స్, ఆపిల్ డివైజ్‌ల సేల్స్ బాగా తగ్గాయి. దీంతో ఐఫోన్ 16 సిరీస్ ఉత్పత్తిని చైనాలో ఆపిల్ భారీగా తగ్గించింది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. కొత్త ఐఫోన్ 17 లైనప్, ఐఫోన్ ఎయిర్ కు వస్తున్న డిమాండ్ ఆపిల్ దశనే మార్చేశాయి.
Also Read: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో నకిలి ఐఫోన్ డెలివరీ? ఈ జాగ్రత్తలు పాటించండి