Iran Vs America: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసినట్టేనా? ఇరాన్ పతనం దిశగా అడుగులు వేస్తోందా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యల వెనుక ఏం జరుగుతోంది? లేకుంటే ఆ దేశాన్ని భయపెట్టేందుకు ఆ విధంగా అన్నారా? అదే నిజమైతే హోర్మూజ్ జలసంధి ఇక తెరుచుకోవడం ఖాయం.
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
బుధవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. దాని సారాంశం ఏంటంటే.. ఇరాన్ పతనం అంచున ఉందని రాసుకొచ్చారు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రతినిధులు తమకు చెప్పారని వెల్లడించారు. వీలైనంత త్వరగా హర్మూజ్ జలసంధిని తెరవాలని వారు కోరుకుంటున్నారని, హర్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని ముగించాలని వారు కోరారని అందులో ప్రస్తావించారు.
ఇది కేవలం అమెరికా వెర్షన్ మాత్రమే. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన ఇప్పటివరకు రాలేదు. ఎందుకంటే ఇటీవల పాలనలో సైన్యం జోక్యం పెరిగిందని ఇరాన్ కీలక నేతలు ఖమేనికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఇరాన్ తన నాయకత్వాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో ఉందన్నారు.
పతనం అంచున ఇరాన్, జలసంది మాటేంటి?
చర్చల విషయంలో ఇరాన్ ప్రభుత్వంలో ఉన్న అంతర్గత విభేదాలను వాళ్లు పరిష్కరించుకోవాలన్నది ట్రంప్ మాట. ఈ విషయాన్ని ఇరాన్ పాలకులు ఎవరు చెప్పారనే వివరాలు వెల్లడించలేదు. సంభాషణ జరిగిందా? మధ్యవర్తి ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారా? అనేదానిపై వైట్‌హౌస్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరోవైపు హోర్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని తొలగించి, అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేస్తే యుద్ధానికి ముగింపు పలుకుతామని ఇరాన్ ప్రతిపాదన చేసిందని వార్తలు వస్తున్నాయి. అందుకు అమెరికా ససేమిరా అంటోంది. అణ్వస్త్ర తయారీ ప్రణాళికలను టెహ్రాన్ పూర్తిగా వదులు కోవాల్సిందేనని తేల్చి చెప్పింది.
ALSO READ: యూఏఈ షాకింగ్ నిర్ణయం.. ఒపెక్, ఒపెక్+ ల నుంచి బయటకు!
ఇదిలావుండగా అణు ప్రణాళికలపై చర్చలను వాయిదా వేయడం తమకు అంగీకరించమని తేల్చిచెప్పారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. తాము కుదుర్చుకునే ఏ ఒప్పందమైనా అణ్వస్త్రాల వైపు వెళ్లకుండా నివారించేలా ఉండాలని ఓ న్యూస్ ఏజెన్సీతో ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ద్వారా అందిన వర్తమానం మేరకు.. టెహ్రాన్ ప్రతిపాదనపై అమెరికా జాతీయ భద్రతా బృందం సమీక్షా సమావేశం నిర్వహించినట్లు శ్వేతసౌధం తెలిపింది.