Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు శుభవార్త చెప్పారు. భారత్ పై విధించిన 25 శాతం సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్ లో మాట్లాడారు. అనంతరం కాసేపటికే టారిఫ్ లపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ లో ఈ మేరకు పోస్టు చేశారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్ భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. త్వరలోనే భారత్-యూఎస్ మధ్య ట్రేడ్ డీల్ ఫైనల్ కానుందని తెలుస్తోంది.
టారిఫ్ ల తగ్గింపుపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్లు చేశారు. “నా ప్రియమైన స్నేహితుడు అధ్యక్షుడు ట్రంప్‌తో ఈరోజు మాట్లాడాను. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై ఇప్పుడు 18% సుంకం మాత్రమే విధిస్తారు. సుంకాలు తగ్గింపు ప్రకటన చేసినందుకు 1.4 బిలియన్ల భారత్ ప్రజల తరపున యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేసినప్పుడు, ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. పరస్పరం ప్రయోజనాల కోసం అపారమైన అవకాశాలను మెరుగుపరుచుకోవాలి. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం చాలా ముఖ్యమైనది. శాంతి కోసం ఆయన చేసే ప్రయత్నాలకు భారత్ పూర్తిగా మద్దతు ఇస్తుంది. యూఎస్ భారత్ భాగస్వామ్యాన్ని మరిన్ని శిఖరాలకు తీసుకెళ్లడానికి ట్రంప్ తో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను.” అని ప్రధాని మోదీ ట్వీట్లు చేశారు.
టారిఫ్ లో తగ్గింపుపై భారత్ లో యూఎస్ అంబాసిడర్ హర్ష వ్యక్తం చేశారు. “నేను చాలాసార్లు చెప్పినట్లుగా అధ్యక్షుడు ట్రంప్ ప్రధానమంత్రి మోడీని గొప్ప స్నేహితుడిగా భావిస్తారు. తాజా వాణిజ్య ఒప్పందం వార్తలతో నేను చాలా సంతోషించాను. అమెరికా, భారతదేశం మధ్య అపరిమితమైన బంధం ఉంది” అని అంబాసిడర్ సెర్గియో గోర్ అన్నారు.
అమెరికాపై విధిస్తున్న సుంకాలను పూర్తిగా తొలగించేందుకు భారత్ అంగీకరించింది. సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధన, సాంకేతిక, బొగ్గు ఉతర ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ నకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేస్తామని భారత్ ఎలాంటి అధికారిక ప్రవటన చేయలేదు.
Also Read: ఆయన భార్య అందగత్తె.. అందుకే ఆ పదవి ఇచ్చా! నోరుజారిన ట్రంప్..