US-China : అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్. తగ్గేదేలే అంటూ ఇరు దేశాలు పోటాపోటీగా పన్నులు విధించుకున్నాయి. ప్రపంచ మార్కెట్లను కంగారు పెట్టాయి. పంతానికి పోయి పన్నులు పెంచుకుంటూ పోతే ఆ రెండు దేశాలకూ తీవ్ర నష్టమే జరుగుతోంది. ఈ విషయాన్ని వెంటనే గుర్తించినట్టున్నారు. చర్చలకు ముందుకొచ్చారు. జెనీవా వేదికగా ట్రేడ్ డీల్‌పై అమెరికా, చైనా అధ్యక్షులు చర్చలు జరిపారు. టారీఫ్ వార్‌కు బ్రేక్ పడినట్టేనని అంటున్నారు. భేటీపై చైనా ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా.. అమెరికా మాత్రం స్పందించింది. చర్చలు సానుకూలంగా జరిగాయని.. సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపింది.
చేతులు కాలాక..
ట్రేడ్ వార్‌లో ఇరు దేశాలు నష్టాలను తగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే ఇప్పటి వరకూ సై అంటే సై అనుకున్నా.. ఇప్పుడు చర్చలు జరుపుతున్నాయి. ఇరుదేశాల మధ్య 1.2 ట్రిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది. చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. భేటీ బాగా జరిగిందని.. కొన్ని విషయాలపై అంగీకారానికి వచ్చినట్టు తెలిపారు.
ట్రేడ్ డీల్ ఓకే..
ఇరు దేశాలు ప్రస్తుతం భారీ స్థాయిలో టారీఫ్‌లు విధించుకున్నాయి. చైనాపై 145 టారిఫ్‌లను ట్రంప్ విధిస్తే.. కౌంటర్‌గా అమెరికాపై 125 టారిఫ్ విధించింది చైనా. దీనికి తోడు అరుదైన ఖనిజాల ఎగుమతిని నిలిపేసింది. ట్రేడ్ వార్ రెండు దేశాలకూ నష్టం చేసేదే కావడంతో.. అమెరికా చైనాలు ఇప్పుడు కాస్త దిగొచ్చి.. ట్రేడ్ డీల్ దిశగా చర్చలు జరుపుతున్నాయి.
మన మార్కెట్లలో జోష్
మరోవైపు.. యూఎస్, చైనా ట్రేడ్ చర్చలు, ఇండియా పాకిస్తాన్ యుద్ధం తాత్కాలికంగా ముగియడంతో.. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు చవిచూశాయి. సెన్సెక్స్ 13వందల 50 పాయింట్ల లాభంతో ఓపెన్ అయింది. నిఫ్టీ 400 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత మరింత లాభాల్లో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 2500 పాయింట్లు, నిఫ్టీ 700 పాయింట్లకు పైగా లాభాల్లో రన్ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 81 వేల పాయింట్ల పైన ట్రేడ్ అవుతోంది. దలాల్ స్ట్రీట్‌లో ఇన్వెస్టర్లు సంబరాలు చేసుకుంటున్నారు. మొదటినుంచీ ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్తతలను దేశీయ మార్కెట్లు లైట్ తీసుకున్నాయి. అణ్వాయుధాలు, మిస్సైల్స్ ఉన్నాయని పాక్ ఆర్మీ ప్రచారం చేసుకున్నా.. మన మార్కెట్లు అంతగా స్పందించలేదు. భారీ పతనాలు గట్రా జరగలేదు.
పాక్ మార్కెట్లు ఫసక్
ఇండియాకు పాక్ తో వచ్చిన నష్టం లేదన్నట్టు మన మార్కెట్లలో పెట్టుబడులు పెడుతూనే వచ్చారు. కానీ.. పాక్ మార్కెట్లు తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పహల్గాం దాడి జరిగిన తర్వాత KSE 100 కుప్ప కూలింది. మనం ఆంక్షలు విధించిన వెంటనే అక్కడ మార్కెట్లు 2 శాతం పడిపోయాయి. భారత్ దెబ్బకు KSE 100 వెబ్ సైట్ కొన్ని గంటల పాటు మూతపడింది. ఆపరేషన్ సింధూర్‌తో ఏకంగా 6 శాతం పడిపోయింది. ఆ దెబ్బకే.. మాకు ఆర్థిక సాయం చేయాలంటూ పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలకు విజ్ఞప్తులు చేసింది. ఇటు యుద్ధం కొలిక్కిరావడం, అటు అమెరికా, చైనా ట్రేడ్ డీల్ దిశగా చర్చలు జరపడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు రాకెట్లలా పైపైకి దూసుకుపోతున్నాయి. మనం ఇక తగ్గేదేలే.